WORLD BANK LOAN FOR AMARAVATI: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాజధాని అమరావతికి మంచి రోజులు నడుస్తున్నాయి. అమరావతికి ఇప్పటికే 6 వేల 700 కోట్ల రుణాన్ని ఏడీబీ మంజూరు చేయగా, తాజాగా ప్రపంచ బ్యాంకు కూడా రాజధాని నిర్మాణం కోసం రుణం ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది. గురువారం జరిగిన ప్రపంచ బ్యాంకు బోర్డు సమావేశంలో అమరావతికి 6 వేల 800 కోట్ల రూపాయల రుణం ఇచ్చేందుకు ఆమోదముద్ర వేసింది. అమరావతి నిర్మాణానికి నిధులు ఇస్తామని గతంలో కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో ప్రకటన చేసింది. ప్రపంచ బ్యాంకు, ఏడీబీల (ASIAN DEVELOPMENT BANK) ద్వారా నిధులు సమకూరుస్తామని చెప్పింది. ఈ 2 సంస్థల ద్వారా 13 వేల 500 కోట్ల రూపాయల నిధులు సమకూర్చుతామని పేర్కొంది. ఈ నేపథ్యంలోనే రుణం ఇచ్చేందుకు ప్రపంచ బ్యాంకు ఆమోదం తెలిపింది.
అమరావతి అద్భుతమైన మోడల్ : అమరావతి సమగ్ర, స్థిరమైన అభివృద్ధికి మద్దతిస్తున్నట్లు ప్రపంచ బ్యాంకు ప్రకటించింది. దేశంలో 2050 నాటికి పట్టణ జనాభా 95 కోట్లకు చేరుతుందని, పట్టణ పరివర్తనకు అమరావతి అద్భుతమైన మోడల్ అని కొనియాడింది. ప్రపంచ నైపుణ్యాన్ని అమరావతికి తీసుకొస్తున్నామన్న ప్రపంచ బ్యాంకు, ప్రస్తుతం అమరావతిలో సుమారు లక్ష మంది నివసిస్తున్నారని తెలిపింది. వచ్చే దశాబ్దంలోపు అమరావతిలో జనాభా అనేక రెట్లు పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేసింది.
ఐదేళ్లలో 50 వేల ఉద్యోగాలు: 2050 నాటికి అమరావతిలో 35 లక్షల మందికి వసతి కల్పించేలా ప్రణాళిక రూపొందించారని, 217 చ.కి.మీ విస్తీర్ణంలో ప్రభుత్వం మాస్టర్ ప్రణాళిక సిద్ధం చేసిందని తెలిపింది. ప్రాజెక్టు భాగస్వాములతో విస్తృత ప్రయత్నాలు చేస్తామన్న ప్రపంచబ్యాంకు, అమరావతిలో 22 శాతం సరసమైన గృహాల కోసం రిజర్వ్ చేశారని గుర్తు చేసింది. అమరావతిలో వచ్చే ఐదేళ్లలో 50 వేల ఉద్యోగాలు సృష్టించే అవకాశం ఉందని పేర్కొంది.
అంతర్జాతీయ పరిజ్ఞానాన్ని అందిస్తాం: 17 వేల మంది వ్యక్తులకు నేరుగా శిక్షణ ఇస్తుందని, అందులో 10 వేల మంది మహిళలు, మెరుగైన, అధిక జీతాలతో ఉద్యోగాలకు వారి జీవన విధానం మెరుగవుతుందని ప్రపంచబ్యాంకు అభిప్రాయపడింది. రోడ్డు గ్రిడ్, ప్రజా రవాణా, వరదల నుంచి ఉపశమనం, నీరు, వ్యర్థజలాల వ్యవస్థలతో నగరానికి అవసరమైన కీలక మౌలిక సదుపాయాలను నిర్మించడానికి అంతర్జాతీయ పరిజ్ఞానాన్ని ప్రపంచబ్యాంకే అందిస్తుందని ప్రకటించింది.