Workshops On Rythu Bharosa :రైతుభరోసా పథకం అమలుపై అనేక ఊహాగానాలు, రకరకాల ప్రచారాలు సాగుతున్న వేళ నేరుగా రైతులు, రైతు సంఘాలు, ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీల సమక్షంలోనే పథకానికి సంబంధించిన విధివిధానాల రూపకల్పన చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తమవుతోంది. ఈ మేరకు రైతు భరోసా పథకం విధి విధానాల రూపకల్పన కోసం నియమించిన మంత్రివర్గ ఉపసంఘం ఉమ్మడి జిల్లాల వారీగా ప్రత్యేక కార్యశాలకు శ్రీకారం చుట్టింది.
రైతు భరోసాపై అభిప్రాయ సేకరణ :ఇందులో భాగంగా నేటి నుంచి ఈ నెల 23వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో రైతు భరోసాపై అభిప్రాయ సేకరణ కోసం ప్రత్యేక కార్యశాల నిర్వహించనున్నారు. మొత్తం తొమ్మిది రోజులపాటు ఈ ప్రత్యేక కార్యక్రమాలు జరగనున్నాయి. ఈ మేరకు తొలి కార్యశాలను వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రాతినిధ్యం వహిస్తున్న ఖమ్మం జిల్లా నుంచి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
Rythu Bharosa Workshop In Khammam :బుధవారం ఉదయం ప్రత్యేక హెలికాఫ్టర్లో హైదరాబాద్ నుంచి మంత్రుల బృందం ఖమ్మం చేరుకోనుంది. జిల్లా కలెక్టరేట్లో రైతు భరోసాపై ప్రత్యేక కార్యశాల నిర్వహించనున్నారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క ఆధ్వర్యంలో కేబినెట్ సబ్ కమిటీలోని సభ్యులైన వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఆర్ అండ్ బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఈ కార్యశాలకు హాజరుకానున్నారు.
కాగా ఈ సమావేశానికి ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల కలెక్టర్లు, వ్యవసాయశాఖ అధికార యంత్రాంగం, రైతులు,రైతు సంఘాలు, రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొననున్నారు. ఈ భేటీలో ప్రధానంగా రైతుబంధు విధివిధానాలపై అన్ని వర్గాల వారితో అభిప్రాయాలు సేకరించనున్నారు. ఇప్పటి వరకు జిల్లాల వారీగా రైతుభరోసాపై ఇప్పటికే వ్యవసాయశాఖ అధికారులు ప్రత్యేక కార్యశాలలు నిర్వహించారు.