Water Workers Call Off Strike In Anantapur District :ఉమ్మడి అనంతపురం జిల్లాలో శ్రీరామిరెడ్డి తాగునీటి పథకం కార్మికులు సమ్మె విరమించారు. ఆరు నెలల వేతనం, ముప్పై నెలల పీఎఫ్ బకాయిలు చెల్లించాలనే డిమాండ్ తో సోమవారం అర్దరాత్రి నుంచి కార్మికులు సమ్మె ప్రారంభించారు. కార్మికుల సమ్మెతో 850 గ్రామాలకు తాగునీరు నిలిచిపోయిందని ఈటీవీ మంగళవారం ఉదయం ప్రత్యక్ష ప్రసారం చేయడంతో రెండు గంటల వ్యవధిలోనే కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు స్పందించారు.
సమ్మెను విరమించిన తాగునీటి కార్మికులు:కార్మికుల సమస్య తెలుసుకోడానికి పంప్ హౌస్ వద్దకు వెళ్లి ఆర్ డబ్ల్యూఎస్ ఎస్ఈ సురేశ్‌ను అనంతపురం నుంచి పిలిపించారు. ఎస్ఈ సురేశ్‌ను కలిసిన ఎమ్మెల్యే సురేంద్రబాబు కార్మికులతో సమావేశం నిర్వహించారు. వేతనాల కోసం సమ్మె చేసే పరిస్థితిని తప్పించాలని కార్మికులు ఎమ్మెల్యేను కోరారు. గతంలో ఉన్న కంట్రాక్టర్ కంటే ప్రస్తుత కంట్రాక్టర్ 2200 రూపాయల వేతనం తగ్గించాడని కార్మికులు వాపోయారు. వేతనం తగ్గించిన తీరుపై తాము ప్రశ్నిస్తే పులివెందుల నుంచి జనాన్ని తీసుకొచ్చి దాడి చేయించే ప్రయత్నం చేశాడని గుత్తేదారుపై ఎమ్మెల్యే సురేంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. కంట్రాక్టర్ వ్యవహారం జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.