Woman Gives Birth to Baby on Chair :నల్గొండ జిల్లా నేరేడుగొమ్మ మండలానికి చెందిన అశ్విని తన భర్తతో కలిసి గురువారం రాత్రి 10 గంటల సమయంలో మూడో కాన్పు కోసం దేవరకొండ ప్రభుత్వాసుపత్రికి వెళ్లింది. అక్కడి సిబ్బంది వైద్యులు అందుబాటులో లేరని, జిల్లా ఆస్పత్రికి వెళ్లాలని సిఫార్సు చేశారు. అక్కడ నుంచి అర్ధరాత్రి అంబులెన్స్‌లో నల్గొండలోని మాతా శిశు ఆరోగ్య కేంద్రానికి వచ్చింది. పరీక్షించిన వైద్యులు ప్రసవానికి ఇంకా సమయం పడుతుందని చెప్పారు.
ఈ క్రమంలో పురిటి నొప్పులు వచ్చి బయట కుర్చీలోనే కూర్చుని శిశువుకు జన్మనిచ్చింది. గమనించిన సిబ్బంది ఆమెను వార్డులోకి తీసుకెళ్లి చికిత్స అందించారు. ఘటనపై జిల్లా అదనపు కలెక్టర్ పూర్ణచందర్ విచారణ చేపట్టారు. ఈ ఘటన పై విచారణ చేపట్టామని అనంతరం బాధితులపై చర్యలు తీసుకుంటామని నల్గొండ జిల్లా అదనపు కలెక్టర్ పూర్ణచందర్ చెప్పారు.
'నేరేడుగొమ్మ మండలానికి చెందిన అశ్విని ఆసుపత్రిలో కుర్చీలోనే ప్రసవం కావడంపై జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు విచారిస్తున్నాం. ఈ విషయంలో ప్రస్తుతానికి ప్రాథమిక విచారణ చేపట్టాం. రాత్రి విధుల్లో వైద్యులు ఎవరు ఉన్నారని, దేవరకొండ నుంచి ఇక్కడికి రిఫర్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని, డాక్టర్లు లేదా సిబ్బంది నిర్లక్ష్యం ఉందా లేదా అనే కోణంలో విచారణ చేపడుతున్నాం. గర్భిణికి ఏ విధంగా పరీక్షలు నిర్వహించారని, ఎందకు ఆమె కుర్చీలోనే ప్రసవించిందని విచారిస్తున్నాం'- పూర్ణచందర్, నల్గొండ జిల్లా అదనపు కలెక్టర్