Woman Became principal who Studied as Student in College : చదివిన కళాశాల, అందులో విద్యార్థిగా చేసిన అల్లరి పనులు గుర్తుకు వస్తేనే ముఖంలో ఏదో తెలియని చిరునవ్వు వికసిస్తుంది. సరదాగా స్నేహితులతో కలిసి చదువుకున్న కాలేజీకి వెళితే నాటి జ్ఞాపకలను గుర్తు చేసుకుని ఒకరిపై ఒకరు జోకులు వేసుకుంటుంటారు. నాడు చదువుకున్న కళాశాలకు ఇవాళ ప్రిన్సిపల్ అవుతే ఎలా ఉంటుంది. ఆ ఊహానే భలే థ్రిలింగ్గా ఉంది కదా. కానీ నిజంగానే ఓ మహిళ ఆమె చదువుకున్న కళాశాలకు నేడు ప్రిన్సిపల్ అయ్యారు. చదివిన చోటే తిరిగి ఉన్నత స్థానంలో కూర్చున్నారు. ఆమె ఎవరో కాదు కామారెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ పళ్లాడి జయకుమారి. రాష్ట్రంలో జరిగిన బదిలీల్లో భాగంగా ఇక్కడి వచ్చిన ఆమె ఆనందానికి అవధుల్లేవు.
భర్త ప్రోత్సాహంతో ఎంఎడ్ :1983-85 విద్యాసంవత్సరంలో జయకుమారి కామారెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సీఈసీ కోర్సు పూర్తి చేశారు. ఆ తర్వాత డిగ్రీ, పీజీ చేశారు. తన భర్త రణవీర్ ప్రోత్సాహంతో ఎంఎడ్ చేశారు. అనంతరం 1995లో డీఎస్సీ ద్వారా ప్రభుత్వ కొలువు సాధించారు. చుక్కాపూర్, కామారెడ్డి ప్రభుత్వ పాఠశాలల్లో చాలాకాలం విధులు నిర్వహించిన ఆమెకు ఇటీవల పదోన్నతి వచ్చింది. కామారెడ్డి, గాంధారి, మాచారెడ్డి బాన్సువాడ ప్రభుత్వ జూనియర్ కళాశాల్లో పనిచేసి చేశారు. ఇటీవల రాష్ట్రంలో జరిగిన బదిలీల్లో భాగంగా ఆమె కామారెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాలకు వచ్చారు.