Wines Shops Closes in TG on Lok Sabha Election Counting:మరికొన్ని గంటల్లో లోక్సభ, సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నిక ఫలితాలు వెలువడనున్నాయి. జూన్ 4 ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ మొదలు కానుంది. దీంతో ఓట్ల లెక్కింపు సందర్భంగా హైదరాబాద్ సీపీ కీలక నిర్ణయం తీసుకున్నారు. మద్యం దుకాణాలు బంద్ సహా పలు ఆంక్షలు విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వీటిని అతిక్రమించిన వారిపై తీవ్రమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. పూర్తి వివరాలు ఈ స్టోరీలో..
మద్యం దుకాణాలు బంద్: మద్యం ప్రియులకు వరుస షాకులు తగులుతున్నాయి. ఏప్రిల్ నెలలో రెండు రోజులు, మే మాసంలో ఏకంగా నాలుగు రోజులు బంద్ అయిన మద్యం దుకాణాలు తాజాగా మరోసారి మూతపడనున్నాయి. లోక్సభ ఓట్ల లెక్కింపు జరిగే జూన్ 4వ తేదీ ఉదయం 6 గంటల నుంచి జూన్ 5 బుధవారం ఉదయం 6 గంటల వరకు మద్యం దుకాణాలు మూసివేయాలని ఆదేశాలిచ్చారు. ఈ ఆదేశాలు ఎవరు అతిక్రమించిన కఠినమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. అలాగే జనసంచారం కలిగిన ప్రాంతంలో బాణాసంచాలను కాల్చడము, విసిరేయొద్దని సీపీ కొత్త కోట శ్రీనివాస రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.
జంట నగరాల్లో 144 సెక్షన్ అమలు: ఓట్ల లెక్కింపు సందర్భంగా కౌంటింగ్ కేంద్రాల దగ్గర కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేశారు. గొడవలకు ఆస్కారం లేకుండా రౌడీ షీటర్లకు హెచ్చరికలు జారీ చేశారు. గుంపులుగా తిరుగుతూ అల్లర్లకు తావివ్వకుండా ఆంక్షలు విధించారు. నగరంలో ఐదుగురికి మించి గుమిగూడకుండా ఆంక్షలను అమలు చేస్తున్నారు. అల్లర్లకు అవకాశం లేకుండా 4వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 144 సెక్షన్ అమల్లో ఉంటుందని హైదరాబాద్ సీపీ ఆదేశాలిచ్చారు.