Wife Commits Suicide Issue:భర్త అప్పులు చేసి మోసానికి పాల్పడి మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని వెళ్లిపోయాడన్న బాధ ఓ వైపు. అప్పిచ్చినవారు బకాయిలు చెల్లించాలని తీవ్ర ఒత్తిడిలు మరోవైపు. ఈ విషయమై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు వెళ్తే ఎస్సై సైతం పట్టించుకోలేదు. దీంతో ఏం చేయాలో దిక్కుతోచక ఓ మహిళ పోలీస్ స్టేషన్ ఎదుట ఆత్మహత్యకు యత్నించి.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతిచెందింది. ఈ హృదయవిదారక ఘటన బాపట్ల జిల్లాలో జరిగింది.
వివరాల్లోకి వెళ్తే: బాపట్లలో వెదులపల్లి వడ్డెర కాలనీకి చెందిన శోభారాణికి కారంచేడు మండలం కుంకుల మర్రకు చెందిన వెంకటరావుతో ఏడేళ్ల క్రితం వివాహమైంది. వెంకట్రావుకు శోభారాణితో ఇది రెండో వివాహం. మొదటి భార్యకు ఇద్దరు సంతానం. అయితే ఆమె చనిపోవటంతో శోభారాణిని అతడు రెండో వివాహం చేసుకున్నాడు. వ్యవసాయ ఖర్చుల నిమిత్తం గ్రామంలో భర్త కోసం రెండు లక్షల రూపాయలకు పైగా అప్పులు చేసింది.
నగదు వాడుకున్న తర్వాత భార్యను వెంకట్రావు వేధింపులకు గురి చేశాడు. వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ నేపథ్యంలో ఐదు నెలల క్రితం ఎద్దులపల్లిలోని పుట్టింటికి శోభారాణి వచ్చింది. చేసిన అప్పు వడ్డీలతో సహా మూడు లక్షల పైగా చేరుకోవడంతో ఇచ్చిన వారు చెల్లించాలని ఒత్తిడి తెస్తున్నారు. ఇటీవల భర్త వెంకట్రావు ఆటో గ్రామానికి తీసుకుని రాగా విషయం తెలిసి వాహనాన్ని తీసుకెళ్లి ఎద్దులపల్లి పోలీసులకు అప్పజెప్పింది. భర్త 2 లక్షలకు పైగా అప్పులు తీసుకుని ఎగ్గొట్టాడని, బకాయిలు చెల్లించే వరకూ వాహనాన్ని విడిచిపెట్టొద్దని ఎస్సై అజితను కోరింది.