Minister Nimmala Rama Naidu Fire on Fake News on Amaravathi:అమరావతి ముంపు ప్రాంతమనే జగన్ కలను సాకారం చేసేందుకు కొందరు కృషి చేస్తున్నారని మంత్రి నిమ్మల రామానాయుడు ధ్వజమెత్తారు. రాజధాని అమరావతికి ఎలాంటి ప్రమాదమూ లేదని స్పష్టం చేశారు. కొన్ని పేటీఎం బృందాలు, పెయిడ్ ఛానళ్లు తీవ్ర దుష్ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. 11.5 లక్షల క్యూసెక్కులు పోటెత్తినా అమరావతి చెక్కుచెదరలేదని మంత్రి వివరించారు. అమరావతిపై విషం చిమ్మడం వైఎస్సార్సీపీకి మొదట్నుంచీ అలవాటేనని ఇలాంటి ఫేక్ న్యూస్ ఎవరూ నమ్మవద్దని మంత్రి నిమ్మల సూచించారు.
కృష్ణా కరకట్టపై మంతెన ఆశ్రమం వద్ద షట్టర్‌కు ఐదేళ్లుగా గ్రీజ్ పెట్టలేదన్నారు. ప్రకాశం బ్యారేజ్‌కు 4 బోట్లు కొట్టుకురావటం వెనుక వైఎస్సార్సీపీ కుట్ర ఉండొచ్చని మంత్రి చెప్పారు. వైఎస్సార్సీపీ నేతలు అంత దుర్మార్గం చేయగల ఘనులేనని విమర్శించారు. బ్యారేజ్ వద్దకు గేట్ల నిపుణుడు కన్నయ్యనాయుడు వస్తున్నారని తెలిపారు. రాత్రికి ప్రకాశం బ్యారేజ్ వద్ద మరమ్మతు పనులు చేస్తారన్నారు. బుడమేరుకు పడిన 3 గండ్లను ఈ రాత్రికి పూడ్చే ప్రయత్నం చేస్తామన్నారు.
విజయవాడ నగరంలోకి భారీ వరద వచ్చేందుకు గత ప్రభుత్వ తప్పులు, పాపాల ఫలితమేనని జలవనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపించారు. నీటి ప్రాజెక్టులపై గత ప్రభుత్వం చేసిన తీవ్ర నిర్లక్ష్యం వల్లే విజయవాడలో ఎప్పుడూ లేని విధంగా వరద వచ్చిందన్నారు. బుడమేరు వరదను కృష్ణాకు మళ్లించే పథకాన్ని గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రారంభించి మెజారిటీ పనులు పూర్తి చేశామన్నారు.
వైఎస్సార్సీపీ ప్రభుత్వం బుడమేరు మళ్లింపు పథకాన్ని పూర్తి చేయకుండా నిర్లక్ష్యం చేసిందన్నారు. పనులు పూర్తికాకపోవడం వల్లే 35 వేల క్యూసెక్కుల వరద వెళ్లేందుకు వీలులేక గండ్లు పడి బెజవాడను ముంచేసిందన్నారు. సీఎం చంద్రబాబు ఆదేశాలతో బుడమేరు కాలువకు పడిన గండ్లను తాత్కాలికంగా పూడ్చేందుకు పనులు చేపట్టామన్నారు. భవిష్యత్తులో గండ్లు పడకుండా కట్ట పటిష్టంగా ఉండేలా పనులు చేస్తామన్నారు. బ్యారేజీ దిగువన రిటైనింగ్ వాల్ పొడిగించి నిర్మించే అంశాన్ని సీఎంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. కృష్ణా నదికి ఎంత వరద వచ్చినా తట్టుకునేలా కరకట్టను పటిష్టం చేస్తున్నామన్నారు. కరకట్టపై 4 లైన్ల రహదారి నిర్మించి పటిష్టం చేసే పనులు ముమ్మరం చేస్తామన్నారు.
వరద బాధితులకు మంత్రుల భరోసా- సహాయక చర్యలపై ఎప్పటికప్పుడు ఆరా - MINISTERs REVIEW ON FLOODS