Voter Awareness Programme in Ongole : ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు విలువ అమూల్యమైనదని ప్రకాశం జిల్లా కలెక్టర్ దినేశ్ కుమార్ అన్నారు. ఓటింగులో మహిళల భాగస్వామ్యం పెరగడం కోసం 'స్వీప్' నోడల్ అధికారుల ఏర్పాటు చేసిన 'సంకల్పం' కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రజాస్వామ్యంలో మహిళలు మూలస్తంభాలని, అర్హులైన మహిళలందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవటానికి సూచికగా రంగురంగుల బెలూన్లను ఎగురవేశారు. కార్యక్రమంలో మహిళలు నిర్వహించిన బుర్రకథ, కోలాటం ఆకట్టుకున్నాయి. మహిళలు, విద్యార్థినులు మానవహారముగా నిల్చొని ఓటు హక్కు వినియోగించుకుంటాని ప్రతిజ్ఞ చేశారు.
Sveep Nodal Officers Organise Awareness Programmes for Voters in AP Prakasam : ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కొన్ని దేశాలలో మహిళలకు ఓటు హక్కు లేని రోజుల్లోనే మన దేశంలో మహిళలకు కూడా రాజ్యాంగం ఓటు హక్కును కల్పించిందన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు ఎంతో విలువైనదని, దీనిని గమనించి అర్హులైన మహిళలందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. డబ్బు, ఇతర ప్రలోభాలకు లొంగకుండా, మెరుగైన భవిష్యత్తు కోసం సమర్థవంతమైన నాయకులకు ఓటు వేయాలని ఆయన సూచించారు. అందుకే పోలింగ్ రోజైన మే 13ను సెలవుదినంగా ప్రకటించినట్లు చెప్పారు. ఆ రోజున కచ్చితంగా ఓటు వేయడంతో పాటు అర్హులైన ఇతరులు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా చూడాలని కోరారు. ప్రజాస్వామ్య వ్యవస్థ మనుగడలో మహిళలు మూల స్తంభాలు అని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు.