Vizianagaram Pydithalli Ammavari Sirimanotsavam 2024: ఉత్తరాంధ్ర ఇలవేల్పు, విజయనగరం ప్రజల ఆరాధ్యదేవత, పూసపాటి వంశీయుల ఇలవేల్పు అయిన శ్రీపైడితల్లి అమ్మవారి సిరిమానోవత్సానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రధానంగా సోమ, మంగళవారం నాడు ప్రధాన ఘట్టాలైన తొలేళ్లు, సిరిమాను ఉత్సవాలు జరగనున్నాయి. లక్షల మంది భక్తులు వచ్చే ఈ ఉత్సవాల కోసం అధికారులు సర్వం సిద్ధం చేశారు. పైడితల్లి అమ్మవారి జాతర ప్రశాంతంగా నిర్వహించడమే లక్ష్యంగా పోలీసు శాఖ సమాయత్తమైంది. సిరిమానోత్సవ నిర్వహణకు 6 వేల మంది పోలీస్ సిబ్బందితో పటిష్ట బందోబస్తు నిర్వహించనున్నారు.
విజయనగరంలో కొలువైన ఉన్న శ్రీపైడితల్లి అమ్మవారి జాతర మహోత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు అధికారులు సర్వం సిద్దం చేశారు. పందిరిరాట ఉత్సవంతో అమ్మవారి ఉత్సవాలకు అంకురార్పణ జరిగింది. 14న అమ్మవారి తొలేళ్ల ఉత్సవం జరగనుండగా, మంగళవారం (15న) నాడు ప్రధాన ఘట్టమైన సిరిమాను సంబరం జరగనుంది. సిరిమాను ఉత్సవం కోసం అవసరమైన చింతచెట్టును డెంకాడ మండలం జరజాపుపేటలో గుర్తించారు. ఈ చెట్టుకు శాస్త్రోత్తంగా పూజలు చేసి, విజయనగరం తీసుకొచ్చారు. ఇప్పటికే గుర్తించిన చెట్టును విజయనగరం హుకుం పేటలో సంప్రదాయబద్ధ రీతిలో సిరిమానుగా మలిచారు.
ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టువస్త్రాలు: అమ్మవారి ఉత్సవాలలో ప్రధాన ఘట్టాలైన తొలెళ్లోత్సవం, సిరిమాను ఉత్సవం తర్వాత తెప్పోత్సవం జరగనుంది. చివరిగా అమ్మవారి ఉయ్యాలకంబాల ఉత్సవంలో ఈ ఏడాది అమ్మవారి ఉత్సవాలు ముగియనున్నాయి. పూసపాటిరాజుల ఆడపడచు అయిన పైడితల్లి అమ్మవారి జాతరను ప్రతీ ఏడాది అంగరంగవైభవంగా నిర్వహిస్తుంటారు. ఆలయానికి వంశపారంపర్య ధర్మకర్తలైన పూసపాటి రాజవంశీయులు అమ్మవారికి సంప్రదాయబద్ధంగా పట్టువస్త్రాలు సమర్పిస్తారు. ఈ పండగను రాష్ట్ర పండుగగా గుర్తించడంతో ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టువస్త్రాలు అందనున్నాయి. ఈ మహోత్సవానికి సంబంధించి ఏర్పాట్లన్నీ పూర్తయినట్లు అధికారులు, ప్రజాప్రతినిధులు తెలియచేశారు.
శ్రీ పైడితల్లి సిరిమానోత్సవంలో కీలక ఘట్టం - సందడిగా అంకురార్పణ - Sri Paidithalli Sirimanotsavam