చావుకైనా సిద్ధం - సీఎం జగన్, ఎంపీ అవినాష్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేసిన దస్తగిరి Viveka Murder Case Approver Dastagiri Sensational Comments: మాజీమంత్రి వివేకానందరెడ్డి హత్యకేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి అయిదేళ్లుగా పులివెందుల వైసీపీ నాయకులకు పక్కలో బల్లెంలో మారారు. వారిపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్న అతనిపై కుట్రతో నాలుగు నెలల కిందట యర్రగుంట్ల, వేముల పోలీసులు అట్రాసిటీ, దాడి కేసులు నమోదు చేసి కడప జైలుకు పంపారు. 4 నెలల పాటు రిమాండ్ ఖైదీగా ఉన్న దస్తగిరికి రెండు వేర్వేరు కేసుల్లో హైకోర్టు, కడప జిల్లా కోర్టు బెయిలు మంజూరు చేయడంతో శుక్రవారం సాయంత్రం జైలు నుంచి విడుదలయ్యారు.
సాయంత్రం 4 గంటల నుంచి అతని భార్య షబానా, పిల్లలు జైలు వద్ద దస్తగిరి కోసం ఎదురు చూశారు. దస్తగిరి జైలు నుంచి విడుదల అవుతున్నారనే సమాచారాన్ని జైలు అధికారులు సంబంధిత జిల్లా పోలీసులకు సమాచారం ఇచ్చారు. కోర్టు ఆదేశాల మేరకు దస్తగిరికి ఆరుగురు పోలీసులు బందోబస్తు ఉన్నారు. వారంతా జైలు వద్దకు సెక్యూరిటీగా వచ్చారు. జైలు నుంచి బయటికి వచ్చిన తర్వాత నేరుగా ఆవరణలోని అతిథి గృహంలో ఉన్న సీబీఐ అధికారుల వద్దకు వెళ్లి దస్తగిరి సమాచారం అందించారు. అక్కడి నుంచి పోలీసు బందోబస్తుతో పులివెందుల ఇంటికి వెళ్లిపోయారు.
వివేకా హత్య కేసులో దస్తగిరికి బెయిల్- 100రోజులుగా కడప జైళ్లోనే
జైల్లోనే చంపేస్తామని హెచ్చరించారు: ఈ సందర్భంగా కడప జైలు వద్ద మీడియాతో మాట్లాడిన దస్తగిరి, మరోసారి సీఎం జగన్ (YS Jagan Mohan Reddy), అవినాష్ రెడ్డిల(YS Avinash Reddy)పై సంచనల ఆరోపణలు చేశారు. వివేకా కేసులో అప్రూవర్‌గా మారి వారికి అడ్డం వస్తున్నాననే ఉద్దేశంతోనే లేనిపోని కేసులు పెట్టి 4 నెలలుగా జైల్లో పెట్టారని పేర్కొన్నారు. అరెస్ట్ సందర్భంగా యర్రగుంట్ల పోలీసులు తీవ్రంగా హింసించారని, అవినాష్ రెడ్డి, జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి చెప్పినట్లు వినకపోతే చావేగతి అనే విధంగా బెదిరించారని ఆరోపించారు. పులివెందులలో తన భార్య ఒంటరిగా ఉన్న సమయంలో వైసీపీ కౌన్సిలర్ ఇంటికి వెళ్లి బెదిరించారని అన్నారు. అవినాష్ రెడ్డికి, జగన్‌కు అనుకూలంగా సాక్ష్యం చెప్పకపోతే జైల్లోనే చంపేస్తామని హెచ్చరించారని తెలిపారు.
మరోసారి లబ్ధి పొందాలని చూస్తున్నారు: వివేకా హత్యలో తప్పు చేసినందుకు ప్రాయశ్చిత్తం పొంది అప్రూవర్‌గా మారానని, ఇపుడు మళ్లీ తాను తప్పు చేయాలని జగన్, అవినాష్ రెడ్డి కుట్రలు పన్నుతున్నారని దస్తగిరి తెలిపారు. గత ఎన్నికల్లో వివేకా హత్యను అడ్డం పెట్టుకుని గెలిచిన జగన్ మోహన్ రెడ్డి, ఈ ఎన్నికల్లో కూడా అప్రూవర్‌గా ఉన్న తనను వారివైపు తిప్పుకుని మరోసారి లబ్ధి పొందాలని చూస్తున్నారని వ్యాఖ్యానించారు. ఇదే అంశంపై నాలుగు నెలలుగా కడప జైల్లో ఉన్న సమయంలో వివేకా కేసులో నిందితుడిగా ఉన్న శివశంకర్ రెడ్డి కుమారుడు డాక్టర్ చైతన్యరెడ్డి కలిశారని గుర్తు చేశారు. తనకు భారీగా డబ్బు ఆశ చూపి తమవైపు రావాలని, సీబీఐ (CBI) ఎస్పీ రాంసింగ్‌కు వ్యతిరేకంగా కోర్టులో సాక్ష్యం చెప్పాలని ప్రలోభ పెట్టినట్లు మీడియాకు వెల్లడించారు.
మొద్దు శీనులాగా తన భర్తను కూడా జైల్లో హతమార్చేందుకు కుట్ర జరుగుతోందని దస్తగిరి భార్య ఆందోళన
చావుకైనా సిద్ధం కానీ వెనక్కి తగ్గేదే లేదు: వైసీపీ నాయకులు ప్రలోభాలకు తాను లొంగే ప్రసక్తే లేదన్న దస్తగిరి, చావుకైనా సిద్ధం కానీ అప్రూవర్ నుంచి వెనక్కి తగ్గేది లేదన్నారు. తాను పులివెందులలోనే అవినాష్ రెడ్డి ఇంటివద్దనే నివాసం ఉంటున్నానని, దేనికైనా సిద్ధం అని సవాల్ విసిరారు. ఎవరు వస్తారో చూసుకుంటా, ఎవరికి భయపడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. జగన్ మోహన్ రెడ్డి, అవినాష్ రెడ్డి పులివెందులలో ఓట్లు అడిగితే ప్రజలు రాళ్లు వేస్తారన్న దస్తగిరి, వివేకాను ఎవరు హత్య చేశారో చెప్పి ఓట్లు అడగాలని తెలిపారు. జగన్ మోహన్ రెడ్డి ఆర్భాటంగా సిద్ధం సభలు పెడుతున్నారని, ఆ సభలో వివేకాను హత్య చేసిందెవరో చెబితే బాగుంటుందని వ్యాఖ్యానించారు.
నాలుగు నెలలపాటు జైలులో ఉన్న దస్తగిరి, బయటికి రాగానే పోలీసులు బందోబస్తుగా ఉన్నారు. పులివెందులలో ఆయన ఇంటికి చేరుకోగానే, ఇంటివద్ద పోలీసు పహారా ఏర్పాటు చేశారు. కోర్టు ఆదేశాల మేరకు దస్తగిరి ఇంటివద్ద, బయటికి వెళ్లినా పోలీసు బందోబస్తు నిర్వహించాల్సి ఉంటుంది.
వైఎస్ వివేకా కేసులో కీలక పరిణామం.. న్యాయ సహాయం అందించాలంటూ సుప్రీంకు దస్తగిరి