Study on Visakhapatnam Coastal Area :వాతావరణం వేడెక్కితే సముద్రం ముందుకొస్తుందా? ఫలితంగా తీరం వెంబడి భూభాగం కనుమరుగవుతుందా? అంటే అవుననే పరిశోధనలు చెబుతున్నాయి. వాతావరణ మార్పులు కారణంగా తీర ప్రాంత నగరాలకు రానున్న కాలంలో భారీ ముప్పు పొంచి ఉంది. ఇదే విషయాన్ని బెంగళూరుకు చెందిన సెంటర్ ఫర్ స్టడీ సైన్స్, టెక్నాలజీ అండ్ పాలసీ (సీఎస్‌టీఈపీ) తాజాగా పేర్కొంది.
ఈ అధ్యయనం ప్రకారం 2040 నాటికి విశాఖ సాగర తీరం వెంబడి 1-5% భూభాగాన్ని కోల్పోయే అవకాశాలుంటాయని హెచ్చరిస్తున్నారు. అంటే సముద్రం ముందుకు చొచ్చుకొస్తే ఏర్పడే కోతతో తీరం వెంబడి ఇసుక తిన్నెల్లో 6.96-7.43 చదరపు కి.మీ. మేర భూమి సముద్రంలో కలిసిపోతుంది. ఈ తాజా వివరాలు విశాఖ వాసులను కలవరపెడుతున్నాయి. కర్బన ఉద్గారాల శాతం భారీగా పెరిగితే 2100 నాటికి 61.58 చదరపు కి.మీ. తీరం సముద్రంలో కలిసిపోతుంది.
ఆర్కే బీచ్ రోడ్డు బోసిపోతుందా?!! చర్చనీయాంశంగా జీవో నెం 1పరిణామాలు
సముద్రం కోత - కలత :ఉమ్మడి విశాఖ పరిధిలో 131 కి.మీ. సముద్ర తీర ప్రాంతం ఉంది. తీరం వెంబడి 43 మత్స్యకార గ్రామాలు ఉన్నాయి. వాటిలో 15 గ్రామాల వద్ద తీరం తరచూ కోతకు గురవుతోంది. గతేడాది 25.8 కి.మీ. పరిధిలో కోతకు గురైనట్లు అధికారులు గుర్తించారు. యారాడ నుంచి పరిశీలిస్తే యారాడ బీచ్, కోస్టల్ బ్యాటరీ, ఆర్కే బీచ్, కురుసుర సబ్‌మెరైన్ మ్యూజియం, చిల్డ్రన్ పార్కు, జోడుగుళ్లపాలెం, రుషికొండ, మంగమారిపేట, భీమిలి పరిధిలో తీరం ఎక్కువగా కోతకు గురవుతోంది. 2014లో హుద్‌హుద్ తుపాను సమయంలో ఆర్కే బీచ్ పరిధిలో కిలోమీటర్ల మేర తీరం దెబ్బతింది.