PMGSY Roads in AP : రాష్ట్రంలో దశాబ్దాలుగా రహదారుల సౌకర్యానికి నోచుకోని గ్రామాలకు మంచి రోజులు రానున్నాయి. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన-4లో ఇలాంటి ప్రాంతాలకు ప్రాధాన్యమివ్వనున్నారు. ఇందుకోసం ఏపీలో 685 గ్రామాలను ప్రాథమికంగా గుర్తించారు. నాలుగు సంవత్సరాల్లో వీటిలో తారు రోడ్లు నిర్మించి సమీప ప్రధాన రహదారులకు అనుసంధానించనున్నారు.
ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజన-3 మార్చి నెలాఖరుతో ముగియనుండటంతో ఇదే పథకం కింద నాలుగో దశలో చేపట్టనున్న పనుల కోసం సమగ్ర ప్రాజెక్టు నివేదికలు (డీపీఆర్) సిద్ధం చేయాలని కేంద్రం అన్ని రాష్ట్రాలకూ మార్గదర్శకాలు జారీ చేసింది. 500 కంటే ఎక్కువ జనాభాగల మైదాన ప్రాంతాల్లో, 200 కంటే మించి జనాభా ఉండి పూర్తిగా వెనుకబడిన ప్రాంతాల్లో, 100 కంటే ఎక్కువ జనాభా కలిగి మావోయిస్టు ప్రభావిత గ్రామాల్లో కొత్తగా తారు రోడ్ల నిర్మాణం చేపట్టనున్నారు.
ఇలాంటి ఆవాస ప్రాంతాలు దేశ వ్యాప్తంగా 25,000ల వరకు ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. వీటిలో 62,500 కిలోమీటర్ల మేర రోడ్ల నిర్మాణం కోసం వచ్చే ఐదు సంవత్సరాల్లో రూ.70,125 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఇందులో కేంద్రం రూ.49,087.50 కోట్లు (60 శాతం), రాష్ట్రాలు రూ.21,037.50 కోట్లు (40 శాతం) వెచ్చించనున్నాయి.
నెలాఖరులోగా సమగ్ర ప్రాజెక్టు నివేదికలు : ఏపీలో మొదటి దశలో చేపట్టే పనుల కోసం నెలాఖరులోగా డీపీఆర్‌లు సిద్ధం చేసి కేంద్ర ప్రభుత్వ ఆమోదానికి పంపనున్నారు. ప్రాథమికంగా గుర్తించిన 685 గ్రామాల్లో మొదటి విడతలో 150 గ్రామాల్లో రోడ్లు నిర్మించనున్నారు. గ్రామాల్లో ప్రస్తుత రోడ్లపరిస్థితిపై ఇంజినీర్లు క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి తారు రోడ్ల నిర్మాణం కోసం అంచనాలను సిద్ధం చేయనున్నారు.
మరోవైపు రాష్ట్రంలో రహదారుల నిర్మాణం, నిర్వహణ, మరమ్మతులపై ఏపీ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. యుద్ధప్రాతిపదికన గుంతలు పూడ్చే పనులు చేపట్టి, వాహనదారులకు మొదట కొంత ఉపశమనం కలిగిస్తోంది. దీర్ఘకాలిక లక్ష్యంతో రోడ్ల విస్తరణ, కల్వర్టులు, వంతెనల తదితరాల నిర్మాణంపై వచ్చే ఐదు సంవత్సరాల్లో చేపట్టాల్సిన ప్రణాళికను సిద్ధం చేసింది. 2025-2026 ఆర్థిక సంవత్సరం నుంచి 2029-2030 వరకు ఐదేళ్లలో 40,178 కిలోమీటర్ల మేర రోడ్లను గాడిలో పెట్టాలని, ఇందుకు రూ.43,173 కోట్ల వ్యయమవుతుందని ఇంజినీర్లు అంచనా వేశారు. ఈ మేరకు సీఎం చంద్రబాబుకు ఇటీవలే ఈ నివేదికను అందజేశారు.