Visakhapatnam Students Got US Fellowship : ప్రస్తుత పోటీ ప్రపంచంలో కృషి, పట్టుదల ఉంటే ఎంతటి విజయాలైనా సాధిస్తామంటున్నారు ఈతరం యువత. అలా సముద్రంలో అంతరించిపోతున్న సీగ్రాస్ తిరిగి పెంచితే ప్రయోజనం చేకూరుతుందని భావించారు విశాఖలోని లంకపల్లి బుల్లయ్య కళాశాల చెందిన విద్యార్థులు. మునపటి పరిస్థితులు నెలకొల్పేలా ఏదైనా పరిష్కారం చూపాలనే వారి ఆలోచనే అమెరికా అవకాశం అందించింది. ఆ విద్యార్థులు చేసిన పరిశోధనలేంటి? కాలుష్యాన్ని నియంత్రించేందుకు అవి ఎలా ఉపయోగపడతాయి?
అమెరికాకు చెందిన ఎన్జీవో ' షేడ్స్ ఆఫ్ పీస్ ', మన దేశంలోని స్టూడెంట్ సొసైటీ ఫర్ క్లైమేట్ చేంజ్ అవేర్నస్ సంస్థ సంయుక్తంగా వాతావరణ మార్పులపై యువత, విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నాయి. అందులో భాగంగా గతేడాది క్లైమేట్ ట్యాంక్ ఎక్సలరేటర్ పోటీ పేరిట యువత నుంచి వినూత్న ఆలోచనలు ఆహ్వానించాయి. 3 నెలలు సమయం ఇచ్చి ఆలోచనలు వర్కింగ్ మోడల్ కింద తీర్చిదిద్దేందుకు ప్రోత్సహించాయి.
అమెరికా పర్యటన : మూడు దశల వడపోత తర్వాత విశాఖలోని బుల్లయ్య కళాశాలకు చెందిన నలుగురు విద్యార్థులు ఈ పోటీల తుదిరేసులో నిలిచారు. బీఎస్సీ మూడో సంవత్సరం చదువుతున్న హర్షిత, అశ్విని, తేజాంబిక్, కార్తికేయ నారాయణ చేసిన పరిశోధనలకు 10 రోజుల అమెరికా పర్యటనకు అవకాశం వరించింది. అక్కడ విశ్వవిద్యాలయాల్లో జరిగే పరిశోధనల్లో విద్యార్థులు పాల్గొననున్నారు.
కాలు కదిపితే నాట్యం - చేయి కదిపితే కరాటే - రెండు రంగాల్లో రాణిస్తున్న రేణుశ్రీ
పరిశోధన దానికే : పర్యావరణంలోకి పెద్దఎత్తున విడులవుతున్న కార్బన్ డై ఆక్సైడ్ సంగ్రహించడంలో 'బ్లూ కార్బన్ ఎకోసిస్టమ్' కీలకం. అడవులు, సీ గ్రాస్ మెడోస్, సాల్ట్ మార్సెస్ ఇందులో భాగం. భూమిపై చెట్లతో పోలిస్తే ఇవి 33% అధికంగా సీవో2ను గ్రహిస్తాయి. కానీ ప్రస్తుతం అంతరించిపోతున్నాయి. విశాఖ తీరం వెంబడి 'సీ గ్రాస్ మెడోస్'ను తిరిగి పునరుద్దరించాలన్నదే ఈ పరిశోధనల ఉద్దేశం.
ఒడిశా బిలికా సరస్సు నుంచి పరిశోధనకు సంబంధించిన నమూనాలు సేకరించామని చెబుతోంది విద్యార్థిని హర్షిత. వాటి శాస్త్రీయ నామాలే 'హలోఫిలా ఓవాలిస్', 'హలోడ్యూల్ పినిపోలియా'. వాటిని స్థానిక వాతావరణ పరిస్థితులను తట్టుకునేలా ప్రయోగశాలలో అభివృద్ధి చేశారు. నిర్వాహక ప్రతినిధులు అందించిన 200 అమెరికన్ డాలర్లతో 2 లైవ్ మోడల్స్‌ను ఏర్పాటు చేసి పరిశోధనలు చేశామని చెబుతోంది హర్షిత.