రాజేశం గొంతునొప్పి, జ్వరంతో బాధపడుతున్నాడు. సమీపంలో ఉన్న మెడికల్ స్టోర్‌కి వెళ్లి మాత్రలు వేసుకోగా ఎలాంటి ఫలితం కనిపించలేదు. రెండో రోజు నుంచి విపరీతమైన ఒళ్లు, కాళ్ల నొప్పులతో శరీరమంతా వేడెక్కడంతో ఆసుపత్రికి వెళ్లారు. రక్త పరీక్షలు చేస్తే వైరల్ జ్వరం అని తేలింది. వారంపాటు మందులు వాడగా జ్వరం తగ్గింది కానీ ఒళ్లు నొప్పులు అలాగే ఉండిపోయాయి.
పెద్దపల్లికి చెందిన రమేష్‌కు జ్వరం లేదు కానీ శరీరం నీరసంగా ఉంటోంది. కాళ్లు, చేతులు లాగినట్లు అనిపిస్తున్నాయి. ఉద్యోగానికి ఉత్సాహంగా వెళ్లలేకపోతున్నారు. డాక్టర్ దగ్గరకు వెళ్లగా కొన్ని మాత్రలు రాసి ఇచ్చారు. మాత్రలు వాడినా నొప్పులు మాత్రం అలానే ఉన్నాయి.
ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో వైరల్ జ్వరాలు విజృంభిస్తున్నాయి. వాతావరణ మార్పుల కారణంగా ఈ వ్యాధుల బారిన పడుతున్నారు. డెంగీ, చికున్‌గున్యా వంటి జబ్బులతో బాధపడుతున్నారు. జ్వరం తగ్గినా ఒళ్లు నొప్పులతో సతమతమవుతున్నారు. ఓవైపు ఉదయమంతా ఎండలు, సాయంత్రం కాగానే వర్షాలతో భిన్న వాతావరణం ప్రజల ఆరోగ్యంపై ప్రభావం చూపుతోంది.
ఒంట్లో రోగ నిరోధక శక్తి తక్కువ ఉన్న వారు త్వరగా వ్యాధుల బారిన పడుతున్నారు. నిత్యం పోషకాహారం తీసుకొంటూ, సరైన శారీరక వ్యాయామం చేసే వారు మాత్రం వీటిని ఎదుర్కోగలుగుతున్నారు. ఈ నేపథ్యంలో పరిసరాలను శుభ్రంగా ఉంచుతూ, రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాన్ని తీసుకుంటే ఈ వ్యాధుల బారి నుంచి బయటపడొచ్చని వైద్యులు సూచిస్తున్నారు.