Vemulawada VIP Break Darshan :దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన వేములవాడలోని శ్రీరాజరాజేశ్వరస్వామి దర్శనానికి రోజురోజుకూ వీఐపీ భక్తుల సంఖ్య పెరగడం వల్ల బ్రేక్ దర్శనానికి శ్రీకారం చుట్టారు ఆలయ అధికారులు. శ్రావణమాసం తొలిరోజైన సోమవారం ఈ బ్రేక్ దర్శనాన్ని ప్రారంభించారు ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. ఈ బ్రేక్ దర్శనానికి ఒక్కొక్కరికి రూ. 300 టికెట్ ధరగా నిర్ణయించారు ఆలయ అధికారులు.
ఇందులో భాగంగా బ్రేక్ దర్శనం చేసుకునే ప్రతి భక్తుడికి 100 గ్రాముల లడ్డును ఉచితంగా అదించనున్నారు. ఈ బ్రేక్ దర్శనాన్ని ఉదయం 10 :15 గంటల నుంచి 11: 15 గంటల వరకు తిరిగి సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు అనుమతించనున్నారు. ఈఓ కార్యాలయం ముందున్న ప్రస్తుత శీఘ్ర దర్శనం క్యూలైన్‌ను బ్రేక్ దర్శనానికి ఉపయోగించాలని అధికారులు నిర్ణయించారు. ఈ మార్గంలో ఆలయ ప్రధాన ద్వారం నుంచి స్వామివారి దర్శనానికి వెళ్లే విధంగా ఏర్పాట్లు చేశారు.
'కేసీఆర్ మాట తప్పారు'
బ్రేక్ దర్శనాన్ని ప్రారంభించిన అనంతరం ఆది శ్రీనివాస్, స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు. మాజీ సీఎం కేసీఆర్ 2016 జూన్‌లో స్వామి వారిని దర్శించుకుని ఏటా ఆలయ అభివృద్ధికి బడ్జెట్లో రూ. 100 కోట్లు కేటాయిస్తామని హామీ ఇచ్చి విస్మరించారని దుయ్యబట్టారు. తన వివాహం ఇక్కడే జరిగిందని, ఆలయాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పి మాట తప్పారని ఆరోపించారు. రంగురంగుల బ్రోచర్లతో మాత్రమే అభివృద్ధిని చూపారని ఎద్దేవా చేశారు.