Free Sand Problems in AP : ఇసుక దందా ప్రస్తుతం ఎంతో ఆర్థికపరమైన వనరు. ఇసుకతో ఎంతో మంది అక్రమంగా రూ.కోట్లు గడిస్తున్నారు. ఇసుక రేవుల్లోకి వెళ్లి ఎవరికి నచ్చినట్లు వారు ఇసుకను టన్నుల కొద్దీ మంచినీళ్లలా తోడేస్తున్నారు. ఈ క్రమంలో అక్కడ ఉండే స్థానికులకు, బయట నుంచి వచ్చిన వారికి మధ్య మినీ యుద్ధాలు జరుగుతున్నాయి. కొన్నిసార్లు ప్రాణాలు సైతం పోతున్నాయి. ఏపీ ప్రభుత్వం అసలైన లబ్ధిదారులకు ఉచితంగా ఇసుక ఇస్తానని చెప్పినా, అది వారికి అందట్లేదు. ఈ పరిణామాలు అన్నీ చూసిన ఓ గ్రామస్థులు ఏకంగా ఆ ఊరికి ఎలాంటి వాహనాలు రాకుండా రోడ్డుకు గండి కొట్టారు. ఈ ఘటన ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మండలం గానుగపాడులో జరిగింది.
ఇసుకాసురులు రేవుల్లో దౌర్జన్యం చేసి, వందల సంఖ్యలో ట్రాక్టర్లతో ట్రక్కు ఇసుకను రూ.3 వేల నుంచి రూ.4 వేలకు విక్రయించి వారి జేబులను నింపుకుంటున్నారు. దీని ఫలితంగా ప్రభుత్వం ఉచిత ఇసుక పాలసీని తీసుకొచ్చినా ఫలితం లేకుండా పోతుంది. ఒక్క ఎన్టీఆర్ జిల్లాలోనే కాదు ఇలాంటి ఇసుకాసురులు ఏపీ వ్యాప్తంగా ఉన్నారు. ఇదేంటని ఎదురు తిరిగితే దౌర్జన్యం చేసి ప్రాణాలనే తీసేంత పని చేస్తున్నారు. ఇలా ఇసుక రేవుల్లో ఎవరికి వారే ముఠాలుగా వచ్చి పెత్తనం చెలాయిస్తున్నారు.
ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లాలోని గానుగపాడు సమీప కట్లేరు రేవులో ప్రతి రోజు వెయ్యికి తగ్గకుండా ట్రాక్టర్లు ఇసుకను అక్రమంగా తరలిస్తున్నాయి. ఇసుక రవాణాకు చింతలపాడు నుంచి గానుగపాడు వరకు వందల సంఖ్యలో ట్రాక్టర్లను రోడ్లపై నిలిపి ఉంచి, అక్కడి స్థానికుల్లో భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. ఈ క్రమంలోనే బుధవారం ఇసుకను తరలించే రోడ్డుకు ఓ వర్గం వారు గండి కొట్టేశారు. అదేమంటే అడిగిన వారిపై దౌర్జన్యానికి దిగుతున్నారు. ఈ గండిని సమీప గ్రామస్థులే కొట్టినట్లు తెలిసింది. ఇతర గ్రామాల వారు రేవులో ఇసుక తరలించకుండా ఈ పని చేసినట్లు తెలుస్తోంది.