Villagers Boycott Gram Sabha in Nizamabad:నిజామాబాద్ జిల్లా డొంకేశ్వర్ మండలంలోని గాదేపల్లి గ్రామంలో మంగళవారం నిర్వహించిన గ్రామసభను స్థానికులు బహిష్కరించారు. ఉదయం సభ ప్రారంభంకాగా ప్రభుత్వ అధికారులు వివిధ పథకాలకు లబ్ధిదారుల వివరాలను వెల్లడించారు. దీనిపై గ్రామస్థులు అభ్యంతరం తెలిపారు. లబ్ధిదారుల ఎంపిక సక్రమంగా జరగలేదన్నారు. ఈ జాబితా మాకు ఆమోదయోగ్యంగా లేదని సభను బహిష్కరించి అక్కడి నుంచి వెళ్లిపోయారు.
రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు సభలు :ప్రభుత్వ పథకాలకు లబ్ధిదారుల ఎంపిక కోసం రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు సభలు కొనసాగుతున్నాయి. 4 పథకాలకు దరఖాస్తుల స్వీకరణ, లబ్ధిదారుల ఎంపికను చేపడుతున్నారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల పథకాలకు దరఖాస్తులు స్వీకరించి గ్రామసభల్లోనే లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు. గ్రామసభల్లో ప్రభుత్వ సంకల్పం, పథకాల వివరాలను ప్రజలకు తెలియజేసి అభిప్రాయాలను సేకరిస్తున్నారు.
గ్రేటర్‌లో కనిపించని వార్డు సభలు : జీహెచ్ఎంసీ పరిధిలో వార్డు సభల నిర్వహణ కనిపించడం లేదు. ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల ఎంపిక కోసం వార్డు సభలు మొదలు కాలేదు. లబ్ధిదారులను గుర్తించేందుకు అధికారుల సర్వే ఇంకా పూర్తి చేయలేదు. గ్రేటర్ సర్వే పూర్తయ్యాక ఫిబ్రవరి 1 నుంచి వార్డు సభలకు పెట్టేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.