Vijayawada MP Meet Union Minister Shekhawat: కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌ను విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) కలిశారు. ఇంద్రకీలాద్రి అభివృద్ధి కోసం ప్రసాద్ (pilgrimage rejuvenation and spiritual augmentation drive) పథకం కింద 100 కోట్ల రూపాయలు మంజూరు చేయాలని ఎంపీ కేశినేని శివనాథ్ కోరారు. దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం అభివృద్ధి కోసం నిధులు మంజూరు చేయాలని వినతి పత్రం అందజేశారు.
ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని దర్శించేందుకు వచ్చే భక్తుల భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని చేపట్టాల్సిన అభివృద్ది కార్యక్రమాలు, నిర్మాణాల ప్రతిపాదనల వివరాలు వినతి పత్రంలో వివరించారు. ఇప్పటికే రెవెన్యూ (దేవాదాయ) శాఖ, దుర్గా మల్లేశ్వరస్వామి వారి దేవస్థానం ఆలయ ఈవో పత్రిపాదనలు పంపించిన విషయం తెలియజేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుమల దేవస్థానం తరువాత అతి పెద్ద దేవస్థానంగా ప్రసిద్ధి పొందిన శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వారి దేవస్థానాన్ని రోజుకి 25 వేల మంది భక్తులు దర్శించుకుంటారని, శుక్రవారం, శనివారం, ఆదివారాలలో 50 వేల మందికి పైగా భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు తరలివస్తారని కేశినేని చిన్ని తెలిపారు.
అలాగే దసరా నవరాత్రులు, భవానీ దీక్ష విరమణ సమయంలో అమ్మవారిని దర్శించుకుని, మొక్కులు చెల్లించుకునేందుకు దేశంలోని పలు రాష్ట్రాల నుంచి 2 లక్షల 50 వేల మందికి పైగా భక్తులు తరలివస్తారని చెప్పారు. ఈ సందర్భంగా భక్తులకి అవసరమైన అవసరమైన మౌలిక సౌకర్యాలు కల్పించేందుకు, ఆలయ అభివృద్దికి ప్రసాద్ పథకం కింద రూ.100 కోట్లు మంజూరు చేయించాలని కోరారు. ఎంపీ కేశినేని శివనాథ్ అభ్యర్ధనలపై కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షేకావత్ సానుకూలంగా స్పందించారు.
గన్నవరం ఎయిర్ పోర్ట్ సేవలు విస్తరించాలి- కేంద్ర మంత్రి రామ్మోహన్‌కు కేశినేని వినతి - Kesineni Meet Kinjarapu Rammohan