Remedies for Acidity at Home : మనలో చాలా మందిని తరచూ ఇబ్బంది పెట్టే అనారోగ్య సమస్యలలో ఎసిడిటీ కూడా ఒకటి. ఈ బాధ వర్ణనాతీతం. అనుభవించిన వారికే ఆ నొప్పేంటో పూర్తిగా తెలుస్తుంది. ఎసిడిటీతో తిన్నా సమస్యే తినకపోయినా సమస్యే. పదే పదే పుల్లటి తేన్పులు రావడం, పొట్టలోని ఆమ్లాలు గొంతులోకి వస్తూ తీవ్రంగా వేధిస్తుంది. కొంతమంది గుండెలో మంటగా ఉంటోందని కూడా చెబుతుంటారు. అయితే, ఎసిడిటీ సమస్యతో బాధపడే వారు ఆహారం విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.
![Remedies for Acidity](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12-02-2025/23526722_gas.jpg)
- ఎసిడిటీ బాధ తీవ్రంగా ఉన్నప్పుడు కూరల్లో కారం, మసాలాలు బాగా తగ్గించాలి. అలాగే నూనె కూడా అతిగా వాడకూడదు. ఇలా అన్ని తగ్గించి తయారు చేసిన ఆహారం తీసుకోవడం వల్ల మంచి ఫలితం కనిపిస్తుంది.
- కొంతమంది రోజూ 4, 5 టీ, కాఫీ కాఫీలు తాగుతుంటారు. అయితే, ఎసిడిటీ ఇబ్బంది పెడుతున్నప్పుడు వీటిని అతిగా తాగకూడదు.
- పొగ, మద్యం వంటి అలవాట్లు ఎసిడిటీ సమస్యను తీవ్రం చేస్తాయి. కాబట్టి, వీటికి దూరంగా ఉండడం మంచిది.
- ఇటీవల కాలంలో ఎక్కువ మంది ఆఫీస్ పనులు, ఇంట్లో తీరిక లేకుండా ఓ పని వెంట మరో పని చేయడంతో సరైన సమయానికి తినడం లేదు. అయితే, ఈ సమస్య ఉన్నవారు వేళకు భోజనం చేయాలి.
- ఒకేసారి ఎక్కువ మొత్తంలో ఆహారం తినకుండా కొద్దికొద్దిగా ఎక్కువసార్లు తినాలి. అలాగే గబగబా తినకుండా నెమ్మదిగా తినాలి.
- కొందరు తిన్న వెంటనే పడుకుంటారు. ఇలా చేయకూడదు. తిన్న తర్వాత తప్పనిసరిగా అరగంటపాటు నడవాలి.
- ఎసిడిటీతో బాధపడే వారు రోజూ రాత్రి పడుకునే ముందు గ్లాసు గోరు వెచ్చని నీళ్లు తాగడం మేలు చేస్తుంది.
- భోజనం చేసిన అనంతరం బాగా పండిన అరటిపండుని తినాలి. ఇందులోని పొటాషియం ఎసిడిటీని తగ్గిస్తుంది.
- తిన్న తర్వాత చిన్న బెల్లం ముక్క నోట్లో వేసుకుని చప్పరించినా మంచి ఫలితం ఉంటుంది.
- కాచి చల్లార్చిన నీటిలోకి కాస్త సోంపును వేయాలి. ఈ నీటిని రాత్రంతా అలాగే ఉంచి ఉదయం తాగాలి.
- అల్లం ఎసిడిటీకి చక్కగా పని చేస్తుంది. ఉదయాన్నే చిన్న అల్లం ముక్క నమలడం లేదా చప్పరించడం వల్ల మేలు కలుగుతుంది.
"ఆహారం సరిగా నమలకపోవడం వల్ల ఎసిడిటీ సమస్య వచ్చే అవకాశం ఉంది. అలాగే మలబద్ధకంతో బాధపడేవారిలోనూ ఈ సమస్య కనిపిస్తుంది. పొగ తాగడం, మద్యం సేవించే వారిలో ఎసిడిటీ సమస్య ఎక్కువగా ఉంటుంది" - డాక్టర్ టి. లక్ష్మీకాంత్, గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్
- అల్లంతో చేసిన టీ తాగవచ్చు.
- మార్నింగ్ రోజూ ఒకటి లేదా రెండు తులసి లేదా పుదీనా ఆకులు నమిలినా ఎసిడిటీకి చెక్ పెట్టచ్చు.
- ఒక గ్లాసులోకి తాజా నారింజ రసం తీసుకుని, అందులో కాస్త వేయించిన జీలకర్ర కలపాలి. దీనిని తాగడం వల్ల తక్షణ ఉపశమనం లభిస్తుంది.
- రోజూ ఉసిరిని తీసుకోవడం వల్ల కూడా ఎసిడిటీ అదుపులో ఉంటుంది.
- లవంగాలు నమిలినప్పుడు వచ్చే ఘాడమైన రుచి అదనపు లాలాజల స్రావానికి కారణమవుతుంది. ఫలితంగా జీర్ణక్రియ మెరుగుపడడంతోపాటు, ఎసిడిటీ సమస్య తగ్గుతుంది.
- కొవ్వు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు, అలాగే నూనె పదార్థాలను తక్కువగా తీసుకోవాలి.
- ఈ ఆహార జాగ్రత్తలు పాటిస్తూ ఒత్తిడి, ఆందోళన వంటి వాటిని తగ్గించుకోవాలని గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ టి. లక్ష్మీకాంత్ తెలిపారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
'లవ్ మ్యారేజ్ చేసుకున్నాక భర్త, అత్తమామలు కులం పేరుతో వేధిస్తున్నారు!' - నేను ఏం చేయాలి?
అల్యూమినియం పాత్రల్లో వంట ప్రమాదకరమా? - డాక్టర్లు ఏం చెప్తున్నారంటే!