Vignan University Focus on Water Purification :ప్రపంచ వ్యాప్తంగా తగ్గిపోతున్న నీటి వనరులు మానవాళి మనుగడకు సరికొత్త సవాళ్లు విసురుతున్నాయి. ఈ తరుణంలో నీటిని పొదుపుగా వాడటంతో పాటు రీ సైక్లింగ్ పైనా ప్రయోగాలు జరుగుతున్నాయి. భవిష్యత్తులో నీటి అవసరాలు గుర్తించిన వారు ఇలాంటి నీటిశుద్ధి ప్లాంట్లను ఏర్పాటు చేసుకుంటున్నారు.
గుంటూరు జిల్లా వడ్లమూడిలోని విజ్ఞాన్ విశ్వవిద్యాలయం కూడా ఇదే ఆలోచనతో మురుగునీటి శుద్ధి ప్లాంటు నిర్మించింది. వర్సిటీ సివిల్ ఇంజినీరింగ్ విభాగం నిపుణుల ఆధ్వర్యంలో ఈ ప్లాంటు ఏర్పాటు చేశారు. తక్కువ ఖర్చుతో నిర్మాణం, అతి తక్కువ నిర్వహణ వ్యయం ఉండేలా ఈ ప్రాజెక్టును రూపొందించారు. యూనివర్సిటీలో నిత్యం 7లక్షల లీటర్ల నీటిని వినియోగిస్తుంటారు. ఒకప్పుడు అదంతా మురుగునీరుగా వెళ్లిపోయేది.
ప్రస్తుతం రీసైక్లింగ్ ప్లాంట్ ద్వారా మూడు అంచెల్లో మురుగునీటిని స్వచ్ఛంగా మారుస్తున్నారు. క్యాంపస్‌లోని మురుగునీరంతా ముందుగా ట్యాంకుల్లోకి చేరుతుంది. లక్ష లీటర్ల సామర్థ్యంతో ఏడు ట్యాంకులు ఇక్కడ ఉన్నాయి. నీటిలో కలిసిన మలినాల్నిశుద్ధి చేసేందుకు కూడా సహజసిద్ధమైన విధానాన్ని పాటిస్తున్నారు. ట్యాంకుల్లోని నీటిని పైపుల ద్వారా పక్కనే ఉన్న తడి నేలల్లోకి పంపిస్తారు. ఇక్కడ నేలపై దాదాపు 4 అడుగుల మేర కంకరతో నింపారు. అందులో వేర్ల ద్వారా వివిధ రకాల రసాయనాల్ని పీల్చుకునే స్వభావం కలిగిన మొక్కలు నాటారు. ఈ మొక్కల ద్వారానే నీరు శుద్ధి జరిగి ఓపెన్ ట్యాంకులోకి చేరుతుంది. దానిని ఓజేనేషన్ ప్రక్రియ ద్వారా పూర్తి స్థాయిలో సురక్షితమైన నీటిగా మారుస్తున్నారు.
మత్స్యపురిలో మంచినీటి శుద్ధి కేంద్రాన్ని ప్రారంభించిన కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్