Vigilance Report On Medigadda :మేడిగడ్డ సహా అన్నారం, సుందిళ్ల ఆనకట్టలకు సంబంధించి విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం మధ్యంతర నివేదిక ఇచ్చింది. కాళేశ్వరం ఆనకట్టల అంశాలపై విచారణ చేస్తున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్‌కు విజిలెన్స్ డీజీ సీవీ ఆనంద్ మధ్యంతర నివేదిక అందించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మూడు ఆనకట్టలపై విచారణ చేసిన విజిలెన్స్ విభాగం పలు కీలక అంశాలను గుర్తించింది.
గతంలోనే ఈ అంశాలు చాలా వరకు వెలుగులోకి వచ్చాయి. వాటి ఆధారంగా రామగుండం ఈఎన్సీగా ఉన్న నల్లా వెంకటేశ్వర్లును తొలగించిన ప్రభుత్వం ఈఎన్సీ జనరల్‌గా ఉన్న మురళీధర్‌ను రాజీనామా చేయాలని అప్పట్లోనే ఆదేశించింది. అప్పట్లో వెలుగులోకి వచ్చిన అంశాల ప్రకారం మేడిగడ్డ ఆనకట్ట కుంగుబాటు విషయంలో ఇటు గుత్తేదారు సంస్థ, అటు నీటి పారుదల శాఖ రెండూ ఉదాసీనంగా వ్యవహరించాయని విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం ఆక్షేపించింది.
మేడిగడ్డలో ఒప్పందానికి విరుద్ధంగా పనులు :ప్రాజెక్టు నిర్మాణంలో అడుగడుగునా లోపాలను ఎత్తిచూపింది. నిర్మాణం ప్రారంభమయ్యాక అనేక మార్పులు జరిగాయని, భద్రతకు సంబంధించిన నిబంధనల గురించి పట్టించుకోలేదని వెల్లడించింది. బ్యారేజీ నిర్మాణ వైఫల్యంపై పూర్తి నిర్ధారణ కోసం నిపుణుల కమిటీ వేయాలని విజిలెన్స్ విభాగం ప్రభుత్వానికి సూచించింది. మేడిగడ్డ ఆనకట్ట ఏడో బ్లాక్నకు సంబంధించి 16 నుంచి 21 వ పియర్స్ వరకు పగుళ్లు ఉన్నాయని విజిలెన్స్ కమిటీ పేర్కొంది.
3డి నమూనాకు అనుగుణంగా అప్ స్ట్రీమ్, డౌన్ స్ట్రీమ్ భారాన్ని సరి చేయలేదని తెలిపింది. 6, 7, 8 బ్లాకులను ఎల్ అండ్ టీ కాకుండా సబ్ కాంట్రాక్టర్లు నిర్మించారని, మేడిగడ్డలో ఒప్పందానికి విరుద్ధంగా పనులు జరిగాయని నివేదికలో స్పష్టం చేసింది. ప్రాజెక్టు ప్రారంభించి ఐదు సీజన్లు పూర్తయినా కాఫర్ డ్యాం తొలగించలేదని కటాఫ్ వాల్స్, రాఫ్ట్ మధ్య ప్రణాళిక ప్రకారం అనుసంధానం లేదని విజిలెన్స్ తెలిపింది. ఆనకట్టకు ఎలాంటి నిర్వహణ చేపట్టలేదన్న విజిలెన్స్ విభాగం దెబ్బతిన్న ప్రాంతాల్లో మరమ్మతుల కోసం నాలుగు సార్లు నోటీసులు ఇచ్చినట్లు పేర్కొంది.
ఫ్లింత్ స్లాబ్ జాయింట్ డ్యామేజ్ :2020 మే, 2021 ఫిబ్రవరి, 2022 ఏప్రిల్, 2023 ఏప్రిల్‌లో తాఖీదులు ఇచ్చి మరమ్మతులు చేయాలని కోరినప్పటికీ నీటిపారుదల శాఖ, ఏజెన్సీ దెబ్బతిన్న భాగానికి ఎలాంటి మరమ్మతులు చేయలేదని స్పష్టం చేసింది. బ్యారేజీ ఆపరేషన్‌లోకి తీసుకొచ్చే ముందు తనిఖీ చేయలేదని, సీసీ బ్లాకులను ప్రాజెక్టు అథారిటీస్ కనీసం తనిఖీ కూడా చేయలేదని విజిలెన్స్ కమిటీ తన నివేదికలో పేర్కొంది పేర్కొంది. 2019 నవంబర్‌లోనే "ప్లింత్ స్లాబ్ జాయింట్" డ్యామేజ్ అయిందని, 2019 జూన్ 19న ఆనకట్ట ప్రారంభం నుంచి నిర్వహణ లేదని నివేదికలో తెలిపింది.