Vigilance investigation on Green Grace Apartments : గుంటూరులో నిర్మాణంలో ఉన్న వైఎస్సార్సీపీ నేత అంబటి మురళీకృష్ణకు చెందిన గ్రీన్‌గ్రేస్ అపార్ట్‌మెంట్‌ను విజిలెన్స్ అధికారులు పరిశీలించారు. నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి అనుమతులు లేకుండా బహుళ అంతస్థులు నిర్మిస్తున్నారన్న ఫిర్యాదుల మేరకు విజిలెన్స్ విచారణ చేపట్టింది. ప్రభుత్వ ఆదేశాలతో అధికారులు అపార్ట్‌మెంట్ నిర్మాణాలను పరిశీలించారు. నిర్మాణ అనుమతులు, ప్లాన్లు, ఎన్వోసీల వివరాలను అడిగి తీసుకున్నారు. వీటన్నింటినీ పరిశీలించిన తర్వాత నిబంధనల మేరకు నిర్మాణాలు చేపట్టకుంటే చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
రాష్ట్ర ప్రభుత్వానికి గుంటూరు నగరపాలక సంస్థ లేఖ :గుంటూరులో గ్రీన్‌గ్రేస్ అపార్టుమెంట్‌కు పూర్తిస్థాయి అనుమతులు లేకుండా నిర్మించినా పట్టించుకోని అధికారులపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి గుంటూరు నగరపాలక సంస్థ లేఖ రాసింది. 5 అంతస్థులకు అనుమతి తీసుకుని 14 అంతస్తులు నిర్మిస్తున్నా పట్టించుకోలేదని అప్పటి అధికారులు, టౌన్ ప్లానింగ్ సిబ్బందితో పాటు ఉన్నతాధికారులపైనా క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని నగరపాలక సంస్థ లేఖ రాయటం చర్చకు దారితీసింది. క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సిన జాబితాలో ఐఏఎస్ అధికారి కన్నబాబుతో పాటు, పురపాలకశాఖ అదనపు సంచాలకులు అనురాధ ఉన్నారు.
అంబటి మురళి అపార్టుమెంట్లో అక్రమాలు - అధికారుల తనిఖీలు - Ambati Murali Apartment
అనుమతులు లేకుండా అపార్టుమెంట్ నిర్మిస్తున్నా నగరపాలక అధికారులు పట్టించుకోలేదని పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ఆరోపించారు. దీంతో బాధ్యులను గుర్తించాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావడంతో నగరపాలక సంస్థ అధికారులు స్పందించారు. అప్పట్లో ఎవరెవరు పని చేశారు? వారిలో ఎవరైనా ఉద్యోగ విరమణ చేశారా? ప్రస్తుతం ఎవరు ఎక్కడ పని చేస్తున్నారో వారి వివరాలతో సహా సేకరించి ప్రభుత్వానికి తగు చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేశారు.