Vigilance Committee Report on Medigadda Barrage : మేడిగడ్డ బ్యారేజీ కుంగిన ఘటనపై రాష్ట్రప్రభుత్వం నియమించిన విజిలెన్స్ కమిటీ(Vigilence Committee) దర్యాప్తులో దిమ్మ తిరిగే విషయాలు వెలుగులోకి వచ్చాయి. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda) ఏడో బ్లాక్‌లో 16 నుంచి 21 వ పియర్స్ వరకు పగుళ్లు ఉన్నాయని విజిలెన్స్ కమిటీ పేర్కొంది. త్రీడీ నమూనాకు అనుగుణంగా అప్ స్ట్రీమ్, డౌన్ స్ట్రీమ్ భారాన్ని సరి చేయలేదని తెలిపింది. 6,7,8 బ్లాకులను ఎల్ అండ్ టీ కాకుండా సబ్ కాంట్రాక్టర్లు నిర్మించారని, మేడిగడ్డలో ఒప్పందానికి విరుద్ధంగా పనులు జరిగాయని నివేదికలో స్పష్టం చేసింది.
Medigadda barrage Vigilance Report :ప్రాజెక్టు ప్రారంభించి ఐదు సీజన్లు పూర్తయినా కాఫర్ డ్యాం(Coffer Dam) తొలగించలేదని, కటాఫ్ వాల్స్, రాఫ్ట్ మధ్య ప్రణాళిక ప్రకారం అనుసంధానం లేదని విజిలెన్స్ తెలిపింది. ఆనకట్టకు ఎలాంటి మెయింటెనెన్స్ చేపట్టలేదన్న విజిలెన్స్ దెబ్బతిన్న ప్రాంతాల్లో మరమ్మతుల కోసం నాలుగు మార్లు నోటీసులు ఇచ్చినట్లు పేర్కొంది. 2020 మే, 2021 ఫిబ్రవరి, 2022 ఏప్రిల్, 2023 ఏప్రిల్ లో నోటీసులు ఇచ్చి మరమ్మతులు చేయాలని కోరినప్పటికీ నీటిపారుదలశాఖ, ఏజెన్సీ దెబ్బతిన్న భాగానికి ఎలాంటి మరమ్మతులు చేయలేదని స్పష్టం చేసింది.
మేడిగడ్డలో పని పూర్తైనా తొలగించని కాఫర్ డ్యాం - విజిలెన్స్ విచారణలో ఆసక్తికర విషయాలు
Medigadda Barrage Mistakes :బ్యారేజీ ఆపరేషన్‌లోకి తీసుకొచ్చే ముందు తనిఖీ చేయలేదని, సీసీ బ్లాకులను ప్రాజెక్టు అథారిటీస్ కనీసం తనిఖీ కూడా చేయలేదని విజిలెన్స్ కమిటీ పేర్కొంది. 2019 నవంబర్‌లోనే ప్లింత్ స్లాబ్ జాయింట్ డ్యామేజ్ అయిందని, 2019 జూన్ 19న ఆనకట్ట ప్రారంభం నుంచి మెయింటెనెన్స్ లేదని నివేదికలో తెలిపింది. రాఫ్ట్, సీకెంట్ పైల్స్ నిర్ధిష్ట పద్ధతి ప్రకారం నిర్మించలేదని, ఒప్పందంలోని 50వ షరతు ప్రకారం గుత్తేదారు పనులు పూర్తి చేయలేదని తెలిపింది.