First Golden Hour in Cyber Fraud : విజయనగరానికి చెందిన ఓ విశ్రాంత అధ్యాపకురాలిని సైబర్ నేరగాళ్లు డిజిటల్ అరెస్టు పేరిట భయపెట్టి ఏకంగా రూ.40.11 లక్షలు కాజేశారు. అనంతరం మోసపోయానని గ్రహించి ఆమె వెంటనే టోల్‌ఫ్రీ నంబరు(1930)కు, స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. చర్యలు తీసుకున్న పోలీసులు నేరగాళ్ల ఖాతాలను జమ్మూకశ్మీర్‌లో ఉన్నట్టు గుర్తించారు. వెంటనే అందులో జమైన బాధితురాలి డబ్బును స్తంభింపచేశారు. తరువాత నిందితుల్ని సైతం అరెస్టు చేశారు. కాజేసిన డబ్బులో ఇప్పటికే రూ.20 లక్షలు బాధితురాలికి ఇప్పించగలిగారు. ఘటన జరిగిన మొదటి గంటలోపు బాధితురాలు ఫిర్యాదు చేయడంతోనే ఇది సాధ్యమైంది.
‘గోల్డెన్ అవర్’ ఎంతో కీలకం : సాధారణంగా రోడ్డు ప్రమాదాలకు గురైన వారి ప్రాణాలు కాపాడేందుకు ‘గోల్డెన్ అవర్’ ఎంతో కీలకం. అలాగే సైబర్ నేరాల బాధితులు పోగొట్టుకున్న డబ్బు తిరిగి పొందడానికి, నేరగాళ్లను పట్టుకోవడానికి కూడా ‘గోల్డెన్ అవర్’ అంతే ముఖ్యం. సైబర్ నేరం జరిగిన గంటలోగా బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయాలి. అప్పుడు కోల్పోయిన డబ్బును తిరిగి రాబట్టగలిగే అవకాశాలు ఎక్కువ. రాష్ట్రంలో గత రెండు సంవత్సరాలలో సైబర్ నేరాలపై టోల్‌ఫ్రీ నంబరుకు 11,97,969 ఫిర్యాదులు అందాయి. 1,598 కేసులు నమోదయ్యాయి. రూ.1,402 కోట్లను బాధితులు పోగొట్టుకున్నారు. పలువురు నేరం జరిగిన మొదటి గంటలోపు ఫిర్యాదు చేయడంతో రూ.274 కోట్లు (19.54%) ఖాతాల్లో నుంచి నేరగాళ్లకు పోకుండా పోలీసులు స్తంభింపచేయగలిగారు. కొంత సొత్తును తిరిగి బాధితులకు ఇప్పించగలిగారు.
ఆలస్యం చేస్తే అంతే :సైబర్ నేరాల్లో కోల్పోయిన డబ్బుకు రికవరీ శాతం చాలా తక్కువగా ఉంటుంది. దీనికి ప్రధాన కారణం, సైబర్ నేరగాళ్లు ఆ డబ్బును కాజేసిన గంటల వ్యవధిలో వివిధ పేర్లతో ఉన్న వందల ఖాతాల్లోకి, ఇ-వ్యాలెట్లలోకి మళ్లిస్తారు. తరువాత అక్కడి నుంచి మళ్లీ వేరే ఖాతాల్లోకి పంపి చివరికి ATMల ద్వారా డబ్బును డ్రా చేస్తారు. లేదంటే ఆ డబ్బును క్రిప్టో కరెన్సీగా మార్చేసుకుంటారు. నిందితులు డబ్బు మళ్లించిన ఖాతాలు కూడా వివిధ రాష్ట్రాల్లో ఉంటాయి. దీంతో వాటిని గుర్తించినా రికవరీ సాధ్యం కావట్లేదు.