ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

BH సిరీస్‌ వాహనాల రిజిస్ట్రేషన్లతో బడా దందా - రాష్ట్ర ఆదాయానికి భారీగా గండి! - BH REGISTRATION SCAMS IN AP

అక్రమార్కులకు దందా మారిన బీహెచ్‌ సీరిస్‌ వాహనాల రిజిస్ట్రేషన్‌ - జీవిత కాల పన్ను ఎగ్గొట్టేందుకే అక్రమాలు

BH Registration Scams in AP
BH Registration Scams in AP (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 24, 2024, 4:49 PM IST

BH-Registration Scams in AP :బీహెచ్-సీరిస్‌ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, వివిధ రాష్ట్రాల్లో కార్యాలయాలున్న పైవేటు ఉద్యోగుల కష్టాలు తీర్చేలా తెచ్చిన రిజిస్ట్రేషన్‌ విధానం. బదిలీలపై వెళ్లిన ప్రతీసారి వాహనాల రిజిస్ట్రేషన్‌ కోసం ఇబ్బందులు పడకుండా కేంద్రం అమలు చేస్తున్న బీహెచ్ సీరిస్‌ అక్రమార్కులకు దందా మారింది. నకిలీ పత్రాలతో పన్నులు తక్కువగా ఉండే రాష్ట్రాల్లో వాహనం కొని భారత్ సీరిస్ కింద వాహనం రిజిస్ట్రేషన్ చేయిస్తున్నారు. ఏపీ సహా 3 రాష్ట్రాల్లో యథేచ్చగా తిరుగుతూ పన్ను ఎగవేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. దీనిపై దృష్టి పెట్టిన రవాణాశాఖ అక్రమార్కులను గుర్తించే పనిలో నిమగ్నమైంది.

రిజిస్ట్రేషన్ చేయాల్సిన అవసరం లేదు :సాధారణంగా ఎవరైనా వాహనాన్ని ఒక రాష్ట్రంలో కొనుగోలు చేస్తే రిజిస్ట్రేషన్ సమయంలోనే జీవితకాల పన్ను చెల్లించాలి. ఏదేని కారణాలతో మరో రాష్ట్రానికి శాశ్వతంగా తీసుకువెళ్తే ఆ రాష్ట్రంలో నిర్ణయించిన మేరకు జీవితకాల పన్నులు చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. దీని వల్ల తరచూ బదిలీలపై వెళ్లే కేంద్ర ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని గుర్తించిన కేంద్రం వారి కోసం వాహనాలను బీహెచ్ సీరిస్‌తో రిజిస్ట్రేషన్ చేసే విధానాన్ని 2021లో తీసుకువచ్చింది. నాన్-ట్రాన్స్‌పోర్ట్ మోటారు వాహనాలను రాష్ట్రాల మధ్య బదిలీని సులభతరం చేసింది.

రక్షణ, రైల్వేలు, పీఎస్​యూలు, బ్యాంకు ఉద్యోగులతో పాటు నాలుగు కంటే ఎక్కువ రాష్ట్రాల్లో కార్యాలయాలున్న ప్రైవేట్ సంస్థల ఉద్యోగులు 'బీహెచ్' సిరీస్ రిజిస్ట్రేషన్‌కు అర్హులు. ఈ విధానంలో ఐటీ ఉద్యోగులు ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి మారినప్పుడల్లా ఆయా రాష్ట్రాల్లో పన్నులు చెల్లించి వాహనాన్ని మరోసారి రిజిస్ట్రేషన్ చేయాల్సి అవసరం ఉండదు. రీ-రిజిస్ట్రేషన్ లేకుండా అదే నంబర్‌ ఉంచుకోవచ్చు. బీహెచ్ సిరీస్ నంబర్‌తో నమోదు చేస్తే దాని పన్ను నేరుగా రాష్ట్రానికి కాకుండా కేంద్రానికి జమ అవుతుంది. ఈ విధానం ఉద్యోగులకు అనువుగా ఉన్నా పన్నుల్లో కోత వల్ల తమకు నష్టం జరుగుతుందని ఏపీ, తమిళనాడు, కేరళ సహా పలు రాష్ట్రాలు దీనికి ఆమోదించ లేదు. అయినా ఈ విధానం పేరిట రాష్ట్రంలో అక్రమాలు వెలుగు చూడటంతో రవాణశాఖ అధికారులు రంగంలోకి దిగారు.

BH Series Registration: ఇకపై ఒకే దేశం.. ఒకే రిజిస్ట్రేషన్​!

13శాతం లైఫ్‌ ట్యాక్స్‌ :'బీహెచ్' శ్రేణిలో రిజిస్ట్రేషన్ కోసం నిర్ణయించిన పన్ను రాష్ట్రాల్లో కంటే తక్కువగా ఉంటుంది. దీనివల్ల వాహనదారులు, వాహన డీలర్లు 'బీహెచ్' సిరీస్‌పై ఆసక్తిని చూపుతున్నారు. సాధారణంగా రాష్ట్రంలో ఏ వాహనం కొన్నా దాని ధరలో 13శాతం జీవిత కాల పన్ను చెల్లించాల్సి ఉంటుంది. 'బీహెచ్' సిరీస్‌లో మాత్రం వాహనం ధరలో కనిష్టంగా 4శాతం చెల్లిస్తే సరిపోతుంది. వాహన యజమాని ప్రతి రెండేళ్లకోసారి 7వాయిదాల్లో పన్ను చెల్లించే వెసులుబాటూ ఇచ్చారు. తద్వారా వాహన యజమానికి వాహనం ధర బట్టి వేలు, లక్షల్లో పన్ను ఆదా అవుతుంది. ఈ కారణాలతో బీహెచ్ సిరీస్ రిజిస్ట్రేషన్‌ కోసం విపరీతంగా ప్రయత్నిస్తుండగా కొందరు అక్రమాలకు పాల్పడుతున్నారు. ఇలా కొందరు ఏపీలో ఖరీదైన వాహనాలు కొనుగోలు చేసినట్లు రవాణా శాఖ గుర్తించింది. నిబంధనల ప్రకారం 13శాతం లైఫ్‌ ట్యాక్స్‌ వసూలు చేసి రాష్ట్ర ఖజానాకు జమచేయాల్సి ఉండగా కేవలం నెల రోజుల టాక్స్ వసూలు చేసి తాత్కాలిక రిజిస్ట్రేషన్లు చేశారు.

రాష్ట్రంలో బీహెచ్ సీరిస్ రిజిస్ట్రేషన్లపై నిషేధం ఉండటంతో ఆ కార్లను బీహెచ్ సీరిస్ రిజిస్ట్రేషన్లు చేయించే ఇతర రాష్ట్రాలకు పంపుతున్నట్లు గుర్తించారు. దీనికి గాను డీలర్లు భారీ ఎత్తున కమిషన్లు దండుకుంటున్నారని తేల్చారు. ఈ తరహాలో విజయవాడలో ఓ డీలర్ 22 లగ్జరీ కార్లు ఇక్కడ విక్రయించి రెండున్నర కోట్ల రూపాయల లైఫ్ టాక్స్ ఎగ్గొట్టారు. ఇతర రాష్ట్రాలకు పంపి అక్కడ రిజిస్ట్రేషన్ చేస్తుండగా రవాణాశాఖ అధికారులు పట్టుకున్నారు. ఐటీ ఉద్యోగుల పేరు చెప్పి నిబంధనల ప్రకారం 3 కంటే ఎక్కువ రాష్ట్రాల్లో కార్యాలయాలున్నాయంటూ తప్పుడు పత్రాలు సృష్టించినట్లు గుర్తించారు. సంబంధిత వాహనాలను సీజ్ చేసి అక్కడి రిజిస్ట్రేషన్లను నిలిపివేశారు. ఇతర రాష్ట్రాల్లో 'బీహెచ్' సిరీస్ కింద నమోదైన కొన్ని వాహనాలు రాష్ట్రంలో తిప్పుతున్నట్లు గుర్తించారు. ఈ తరహాలో డీలర్లు ఎక్కడెక్కడ అక్రమాలకు పాల్పడ్డారు. ఎన్ని లగ్జరీ వాహనాలు అమ్మారు. రాష్ట్రానికి ఎన్నికోట్ల రూపాయల పన్ను ఎగ్గొట్టారనే అంశంపై రవాణాశాఖ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

ఖరీదైన వాహనాలను విక్రయం :గత ప్రభుత్వంలో పర్యవేక్షణ లేమిని అదనుగా తీసుకుని డీలర్లు ఈ తరహా అక్రమాలకు పాల్పడి జేబులు నింపుకున్నట్లు అధికారులు గుర్తించారు. గత ఐదేళ్లలో ఇలాంటివి భారీ ఎత్తున జరిగి ఉంటాయని భావిస్తున్నారు. నిబంధనల ప్రకారం వాహన షోరూం డీలర్ ఆ ప్రాంతంలో నివసించే వారికే వాహనాలు అమ్మాలి. ఇతర ప్రాంతాల్లో చిరునామా ఉంటే వాహనం విక్రయించకూడదు. రిజిస్ట్రేషన్లు చేయకూడదు. కానీ కొందరు డీలర్లు నకిలీ ధ్రువపత్రాలు సృష్టించి వారి పేరిట ఖరీదైన వాహనాలను విక్రయిస్తున్నారు. దీనిపై డీలర్ల వారీగా అమ్మిన వాహనాలు రాష్ట్ర ప్రభుత్వానికి జమచేసిన టాక్స్ మొత్తం పరిశీలిస్తున్నారు. నిబందనలు ఉల్లంఘిస్తే కఠినంగా వ్యవహరిస్తున్నారు.

ఇతర రాష్ట్రాల్లో కొనుగోలు చేసిన వాహనాల రిజిస్ట్రేషన్లను అధికారులు పూర్తిగా నిలిపివేశారు.

'LMV లైసెన్స్ ఉన్నవారంతా ఆ వాహనాలనూ నడపొచ్చు'- సుప్రీంకోర్టు కీలక తీర్పు

ABOUT THE AUTHOR

...view details