Vamsadhara Project Shutters Ruined: వంశధార ప్రాజెక్టు ఆవిర్భవించి ఐదు దశాబ్దాలు కావడంతో కాలువలపై నిర్మించిన షట్టర్లు శిథిలావస్థకు చేరాయి. ఉన్నవి అరకొర కాస్తా ఊడిపోవడంతో ప్రస్తుతం కాలువలపై షట్టర్ల ఆచూకీనే లేదు. దీంతో ఎగువు నుంచి వచ్చే నీరు వృథాగా పోతుంది. అప్పట్లో వంశధార నీటిపారుదల శాఖ అధికారులు చేసిన కుంభకోణం దశాబ్దన్నర కాలంగా రైతులను వెంటాడుతోంది. ప్రధాన కాలువలతో పాటు పిల్ల కాలువలపై షట్టర్లు లేక అన్నదాతలు ఇబ్బంది పడుతున్నారు.
కాలువలు, కాలినడక వంతెనలపై ఎక్కడ చూసినా షట్టర్ల స్థానంలో కర్ర చెక్కలు, గడ్డివాములే దర్శనమిస్తున్నాయి. షట్టర్లు ఏర్పాటు చేయాలని అధికారులను ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా మొహం చాటేస్తున్నారని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫలితంగా అత్యవసర పరిస్థితుల్లో సాగునీటిని నిల్వ చేయలేకపోతున్నామని రైతులు వాపోతున్నారు.
గడుస్తున్న ఏళ్లు - నెరవేరని హామీలు - అంధకారంలో వంశధార నిర్వాసితులు - Vamsadhara Project Expats Problems
వంశధార కాలువపై జిల్లావ్యాప్తంగా 2 వేల 450 షట్టర్లు నిర్మించాల్సిన అవసరం ఉంది. సకాలంలో వాటని పూర్తి చేసి ఉంటే వంశధార ఆయకట్టుకు స్వర్ణ కాలం అనే చెప్పవచ్చు. కానీ కొందరు అధికారులు అవినీతి కుంభకోణానికి (Vamsadhara Shutters Scam) పాల్పడటంతో వంశధార షట్టర్ల వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం అయింది. 2005లో 73.8 కోట్లు ప్రతిపాదించి 2 వేల 36 షట్టర్ల ఏర్పాటుకు ముగ్గురు గుత్తేదారులకు ప్రభుత్వం పనులు అప్పగించిది. నరసన్నపేట, టెక్కలి, హిరమండలం, ఆముదాలవలస డివిజన్ల పరిధిలో షట్టర్లు, కాలినడక వంతెనల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.
పనులు చేపట్టిన కొద్ది కాలంలోనే అధికారులు అవినీతికి పాల్పడుతున్నారంటూ ఫిర్యాదులు రావడంతో 2009 డిసెంబర్ 5వ తేదీన విశాఖపట్నం విజిలెన్స్ విభాగం దాడులు చేసి కేసులు నమోదు చేసింది. ప్రారంభంలో నరసన్నపేట, టెక్కలి డివిజన్లలో మాత్రమే అవినీతి వెలుగు చూడగా కాలక్రమంలో కేసు పరిధి పెరగడంతో 2011 అక్టోబర్ లో కేసును సీఐడీ విభాగానికి బదిలీ చేశారు. దర్యాప్తు ముమ్మరం చేసిన సీఐడీ వంశధార నీటిపారుదల శాఖలోని 33 మంది ఇంజనీర్లను సస్పెండ్ చేసింది.
ఇప్పటికీ కేసు దర్యాప్తు కొనసాగుతుండటంతో పనులు నిలిచిపోయాయి. నీటి కాలువలకు షట్టర్లు లేకపోవడంతో జిల్లాలోని 2 లక్షల ఎకరాలకు రైతులు నీటిని మళ్లించుకోలేకపోతున్నారు. గత్యంతరం లేక బోరు బావుల ద్వారా నీటిని తోడుకోవాల్సిన పరిస్థితి దాపరించింది. సమయానికి నీరు లేకపోవడంతో పంట చేతికి రాక నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా ఎవరూ తమను పట్టించుకోవట్లేదు అని, తామే స్వయంగా సొంత ఖర్చులతో కాలువల పూడికతీత పనులు కూడా చేసుకుంటున్నాం అని రైతులు తెలుపుతున్నారు.
ఏళ్లుగా పూర్తికాని కరకట్టల నిర్మాణాలు - ఏటా ముంపునకు గురవుతున్న 119 గ్రామాలు