IMD Issues Rain Alert in Telangana 2024 : తెలంగాణలో జూన్ 5 తర్వాత తెరిపినిచ్చే వేసవి ఎండలు, ఈ సంవత్సరం ముందస్తు వానలతో మే నెలలోనే చల్లబడ్డాయి. శనివారం సాయంత్రం కూడా హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో ఆకస్మిక వానలు కురిశాయి. రాష్ట్రవ్యాప్తంగా మరో వారం రోజులు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ ప్రకటించింది. ఉరుములు, ఈదురుగాలులు, మెరుపులు ఉంటాయని సూచించింది. ప్రధానంగా ఉమ్మడి నల్గొండ, వరంగల్, కరీంనగర్, ఖమ్మం, రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్‌నగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని పేర్కొంది. 22వ తేదీ వరకు ఎల్లో అలర్ట్ హెచ్చరికలను వాతావరణ శాఖ జారీ చేసింది.
Rains in Hyderabad 2024 : అధిక ఉష్ణోగ్రతలు నమోదైన సమయంలో క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడి ఒక్కసారిగా కుండపోత వర్షాలు సంభవిస్తుంటాయి. ప్రస్తుతం తీవ్రమైన ఎండలు లేనప్పటికీ ఏప్రిల్‌లో నమోదైన రికార్డు స్థాయి ఎండలు ఇప్పుడు ప్రభావం చూపిస్తున్నాయి. ఈ సంవత్సరం గరిష్ఠంగా 47 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మరోవైపు నైరుతి రుతుపవనాల ఆగమనానికి సానుకూల పరిస్థితులు ఏర్పడటంతో, ఒకదాని వెంట ఒకటి ఆవర్తనాలు ఏర్పడుతున్నాయి. మే 31న నైరుతి రుతుపవనాలు దేశంలోకి ప్రవేశిస్తాయని భారత వాతావరణ శాఖ ఇప్పటికే వెల్లడించింది.
పడిపోతున్న సాధారణ ఉష్ణోగ్రతలు : ఈ నెల రెండో వారం నుంచి ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదవుతున్నాయి. వీటి కారణంగా హనుమకొండలో 41.3 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదు కావాల్సి ఉండగా 11.3 డిగ్రీలు తగ్గి 30 డిగ్రీలకు పడిపోయింది. ఇదే తీరులో రామగుండంలో సాధారణం కన్నా 9.2, హైదరాబాద్‌లో 7.9, మెదక్‌లో 7.3, ఖమ్మం 5.1, మహబూబ్‌నగర్ 5, నిజామాబాద్ 6.8, ఆదిలాబాద్ 4.9 డిగ్రీలు తగ్గాయి. రాత్రిపూట ఉష్ణోగ్రతల్లోనూ భారీగా తగ్గుదల కనిపిస్తోంది. మార్చి నుంచి మే 18 వరకు తెలంగాణలో 51.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా 66.4 మిల్లీమీటర్లు నమోదైంది. 23 జిల్లాల్లో సాధారణం కన్నా ఎక్కువగా వానలు కురిశాయి. అయితే ఈ నెలాఖరులో నాలుగైదు రోజులు ఎండలు కొంతమేర పెరిగే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ భావిస్తోంది.