Crop Damage in Telangana :రాష్ట్రంలో రైతులను అకాల వర్షాలు వెంటాడుతున్నాయి. పంట చేతికొచ్చే సమయానికి వర్షాలు తీరని నష్టాన్ని మిగుల్చుతున్నాయి. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఈదురు గాలులతో కూడిన వానతో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి ముద్దయ్యింది. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలంలోని పలు గ్రామాల్లో కురిసిన వడగళ్ల వానకు పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ధాన్యం బస్తాలు, ఆరబెట్టిన ధాన్యం తడిసి ముద్దయింది. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు. బస్వాపూర్‌లో పశువుల పాక కూలి రెండు గేదెలకు తీవ్ర గాయాలయ్యాయి.
Heavy Rains In Telangana : సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలంలోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి ముద్దయింది. దుబ్బాక నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో వర్షం నుంచి ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతులు పడరాని పాట్లు పడ్డారు. చెల్లా చెదురైన వడ్లను కుప్పగా పోసి కవర్లు కప్పారు. దుబ్బాక మార్కెట్ యార్డు కొనుగోలు కేంద్రంలో ధాన్యం నీటిపాలైంది. కోహెడ మండలంలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షానికి పలుచోట్ల మామిడికాయలు నేలరాలాయి. మరోవైపు రాష్ట్రంలో రేపు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ వడగాల్పులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
"అకాల వర్షాల వల్ల ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ధాన్యం బస్తాలు, ఆరబెట్టిన ధాన్యం తడిసి ముద్దయింది. చేతికి వచ్చిన పంట అంతా నష్టపోయాం. అప్పుల సమస్య ఎక్కువైంది. సమస్యలు పెరిగిపోయాయి. ప్రభుత్వం నష్ట పరిహారం ఇచ్చి మమ్మల్ని ఆదుకోవాలి." - బాధిత రైతులు