Union Minister Shivraj Singh Chouhan on Floods:బుడమేరు గండ్లు పూడ్చేందుకు ఆర్మీని పిలుస్తున్నామని కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ తెలిపారు. విజయవాడలో వరద ముంపుతో నష్టపోయిన ప్రాంతాలను ఆయన పరిశీలించారు. ఈ క్రమంలో ప్రజల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వరద విపత్తుపై కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకించారు. వరద నష్టాన్ని ఫొటో ఎగ్జిబిషన్ ద్వారా కేంద్రమంత్రికి సీఎం చంద్రబాబు వివరించారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రులు లోకేష్, అనిత, మనోహర్, అచ్చెన్నాయుడు పాల్లొన్నారు.
ఫొటో ఎగ్జిబిషన్ అనంతరం కేంద్రమంత్రి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో సంభవించిన వరదల గురించి ప్రధాని మోదీకి వివరిస్తానని తెలిపారు. అంతే కాకుండా త్వరగా కేంద్ర సాయం అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. కేంద్ర కమిటీ నివేదిక చూశాక ఆర్థిక సాయం అందుతుందని ఇలాంటి కష్టసమయంలో రాష్ట్రానికి కేంద్రం అండగా ఉంటుందని శివరాజ్‌సింగ్ అన్నారు.
గత ప్రభుత్వ హయాంలో బుడమేరు వద్ద ఆక్రమణలు పెరిగాయని కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్ మండిపడ్డారు. ప్రజలు ఐదు రోజులపాటు వరదనీటిలో ఉండిపోయారని వారి ప్రాణాలు కాపాడేందుకు సీఎం చంద్రబాబు ఎంతో కృషి చేశారని కొనియాడారు. అంతే కాకుండా దగ్గరుండి మరీ సహాయ కార్యక్రమాలు సీఎం పర్యవేక్షించారని అన్నారు. వరద ప్రాంతాల్లో ప్రతి ఒక్కరూ సహాయ కార్యక్రమాలు బాగా చేశారని అభినందించారు. డ్రోన్ల ద్వారా ఫుడ్ ప్యాకెట్లు అందించడం దేశంలోనే తొలిసారని పేర్కొన్నారు. తాగునీరు, పారిశుద్ధ్య కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయని కేంద్రమంత్రి శివరాజ్‌సింగ్ అన్నారు.
వరద ముంపు ప్రాంతాల్లో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పర్యటన - Union Minister visit to Vijayawada