Kishan reddy on Musi Beautification :కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి హైడ్రా, మూసీ సుందరీకరణ తెరపైకి తెచ్చిందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. హైడ్రా పేరుతో పేదల ఇళ్లను కూల్చవద్దని ప్రభుత్వాన్ని కోరామని, సర్కార్ చేస్తున్న విధ్వంసాన్ని ఆపాలని ముఖ్యమంత్రికి లేఖ కూడా రాసినట్లు ఆయన పేర్కొన్నారు. ప్రజల ఆవేదన, మనోవేదనను పరిగణనలోకి తీసుకోకుండా వ్యవహరించడం ఏ మాత్రం న్యాయం కాదని కిషన్‌రెడ్డి హితవు పలికారు.
హైదరాబాద్ డ్రైనేజీ సమస్య తీర్చకుండా, మూసీ సుందరీకరణ పేరుతో లక్ష యాభై వేల కోట్లు ఖర్చు చేయడం అనాలోచిత చర్యనని కిషన్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లోని 70శాతం డ్రైనేజీ నీళ్లు మూసీలోకి వెళ్లుతాయని, మూసీని సుందరీకరణ చేస్తే ఈ డ్రైనేజీ నీళ్లు ఎక్కడికి పోతాయో చెప్పాలని ఆయన నిలదీశారు. అక్రమ నిర్మాణాల పేరుతో పేదల ఇళ్లను కూల్చడాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని, బడా బాబుల ఫామ్‌హౌస్‌లు కూల్చే దమ్ము రేవంత్ రెడ్డి సర్కారుకుందా అని ఆయన ప్రశ్నించారు.
ఓవైసీ ఫాతిమా నిర్మాణాలకు ఎందుకు సమయం ఇచ్చారని కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. ఇందిరమ్మ రాజ్యం అన్న, రాహుల్ గాంధీ ఎక్కడున్నారని ఆయన ప్రశ్నించారు. మూసీ సుందరీకరణకు కేసీఆర్ బీజ్యం వేస్తే, రేవంత్ రెడ్డి భుజాల మీదకు ఎత్తుకుని ప్రజల కడుపుల మీద తన్నుకుంటూ ముందుకు వెళ్తున్నారని కిషన్‌రెడ్డి ఆగ్రహాం వ్యక్తం చేశారు.