Union Home Ministry Reviews Tirupati Stampede Incident : తిరుపతి తొక్కిసలాటపై కేంద్ర హోంశాఖ సమీక్ష చేయనుంది. ఘటనపై ఈ నెల 20న తిరుపతిలో కేంద్ర హోంశాఖ అదనపు కార్యదర్శి సంజీవ్ కుమార్ జిందాల్ సమీక్ష చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే సమీక్ష కు ఏర్పాట్లు చేయాలని టీటీడీని కేంద్ర హోంశాఖ కోరింది. సమీక్ష కోసం కేంద్ర హోంశాఖ అదనపు కార్యదర్శి చెన్నై నుంచి తిరుపతి రానున్నారు.
తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార సర్వదర్శన టోకెన్ల జారీలో తీవ్ర విషాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. అనూహ్యంగా భక్తులు తరలిరావడంతో తోపులాట చోటు చేసుకుంది. తిరుపతి నగరంలోని బైరాగిపట్టెడలో చోటు చేసుకున్న తొక్కిసలాటలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 48 మంది అస్వస్థతకు గురయ్యారు.
తొక్కిసలాటలో గవర్నర్, సీఎంకు ఏం సంబంధం? - పిటిషనర్‌ను ప్రశ్నించిన హైకోర్టు
ఏం జరిగింది : వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం కోసం తిరుపతిలో 8 కేంద్రాల వద్ద స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్ల జారీకి టీటీడీ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ నెల 10, 11, 12 తేదీలకు సంబంధించి మొత్తం 1.20 లక్షల టోకెన్లు జారీ చేయనున్నట్లు ప్రకటించారు. తొలుత గురువారం ఉదయం 5 గంటలకు టోకెన్లను జారీ చేస్తామని వెల్లడించారు. దీంతో వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల కోసం బుధవారం ఉదయం నుంచే భక్తులు టోకెన్ల జారీ కేంద్రాలకు చేరుకున్నారు. బైరాగిపట్టెడలోని రామానాయుడు ప్రభుత్వ ఉన్నత పాఠశాల, సత్యనారాయణపురం జెడ్పీ హైస్కూల్, విష్ణునివాసం, శ్రీనివాసం, ఇందిరా మైదానం, రామచంద్రపుష్కరణి, ఎమ్మార్ పల్లి ప్రాంతాలకు భారీగా భక్తులు తరలివచ్చారు.