AP Bhavan Assets Division in Delhi : దిల్లీలోని ఏపీ భవన్(AP Bhavan) ఆస్తుల విభజన ముగిసినట్లు కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. విభజన చట్టం ప్రకారం ఇరు రాష్ట్రాలు ఆప్షన్ జీని అంగీకరించడంతో ఏపీ భవన్ ఆస్తుల విభజన ప్రక్రియ ముగిస్తున్నట్లు కేంద్ర హోం శాఖ ఉప కార్యదర్శి లలిత్ కపూర్ తెలిపారు. తెలంగాణకు 8.245 ఎకరాలు, ఏపీకి 11.536 ఎకరాలు కేటాయించేలా ఇరు రాష్ట్రాల మధ్య ఒప్పందం జరిగిందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు.
ఏపీ భవనన్లోని శబరి బ్లాక్లో మూడెకరాలు, పటౌడి హౌజ్లో 5.245 ఎకరాలు తెలంగాణకు కేటాయించగా, ఏపీకి గోదావరి, స్వర్ణముఖి బ్లాకుల్లో 5.781 ఎకరాలు, నర్సింగ్ హాస్టల్లో 3.359 ఎకరాలు, పటౌడి హౌజ్లో 2.396 ఎకరాలను ఏపీకి కేటాయించారు. ఏపీ పునర్విభజన చట్టానికి అనుగుణంగా విభజన పూర్తయిందని ఆర్ అండ్ బీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Minister Komatireddy) తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వం పదేళ్లలో చేయలేని పనిని తమ ప్రభుత్వం మూడు నెలల్లో పూర్తి చేసిందన్నారు. త్వరలోనే రాష్ట్ర సంస్కృతీ సంప్రదాయలు ఉట్టిపడేలా దిల్లీలో తెలంగాణ భవన్ నిర్మిస్తామని మంత్రి తెలిపారు.