Unemployed Protest in Chikkadapally Central Library : హైదరాబాద్లోని చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గ్రూప్- 2, గ్రూప్- 3 ఉద్యోగాలు పెంచాలని, గ్రూప్- 2 పరీక్షలు వాయిదా వేయాలని కోరుతూ అభ్యర్థులు పెద్ద ఎత్తున నగర కేంద్ర గ్రంథాలయానికి చేరుకున్నారు. లైబ్రరీ నుంచి శాంతియుతంగా నిరసన ప్రదర్శన చేయడానికి వెళ్తుండగా వారిని పోలీసులు అడ్డుకున్నారు.
ఈ క్రమంలో నిరుద్యోగ అభ్యర్థులకు పోలీసులు మధ్య మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఆందోళన చేస్తున్న పలువురు నిరుద్యోగులను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్లకు తరలించారు. పోలీసుల తీరు దారుణమంటూ ఆవేదన వ్యక్తం చేసిన అభ్యర్థులు, పరీక్షలు వాయిదా వేసే వరకూ పోరాటం ఆగదంటూ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
"మేమైనా తీవ్రవాదులమా, అసలు లైబ్రరీకి పోలీసులు రావాల్సిన అవసరం ఏమున్నది? గ్రూప్ 2 పోస్టులు పెంచి, పరీక్షను వాయిదా వేయాలని అడుగుతున్నందుకు మమ్మల్ని అరెస్ట్ చేస్తారా? మా ఉద్యోగాలు మాకు ఇవ్వండి చాలు. శాంతియుతంగా మా నిరసన తెలియజేయాలని చెప్పి ఇవాళ చిక్కడపల్లి లైబ్రరీకి వస్తే, చాలా దారుణంగా మమ్మల్ని పోలీసులు వ్యాన్లలో ఎక్కించి ఇలా నిర్బందిస్తున్నారు."-నిరుద్యోగులు