శిథిలావస్థలో ఏలూరు గ్రంథాలయం - ఏ క్షణాన ఏం జరుగుతుందోనని నిరుద్యోగుల ఆందోళన (ETV Bharat) Dilapidated District Central Library in Eluru :వందల మంది నిరుద్యోగులు, ఉద్యోగార్థులు పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు వేదికైన జిల్లా కేంద్ర గ్రంథాలయం ఏళ్ల తరబడి నిర్వహణ లేక పాడైంది. పుస్తకాలు చదువుకోవచ్చని లైబ్రరీకి వచ్చే వారి భద్రత గాల్లో దీపంలా మారింది. లైబ్రరీకి వచ్చే వారు జాగ్రత్త వహించాలని స్వయానా గ్రంథాలయ కార్యదర్శి పేరుతో పోస్టర్ పెట్టడం భవనం దుస్థితికి అద్దం పడుతోంది. ఏలూరు నడిబొడ్డున ఉన్న జిల్లా కేంద్ర గ్రంథాలయం ఇది. 1984 మార్చిలో అప్పటి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు ప్రారంభించారు.
40 ఏళ్లకుపైగా సేవలు అందిస్తున్న ఈ లైబ్రరీకి ఏలూరుతో పాటు జిల్లాలోని ఇతర ప్రాంతాల నుంచి నిత్యం వందల మంది నిరుద్యోగులు, విద్యార్థులు వచ్చి పుస్తకాలు చదువుకుంటూ ఉంటారు. ఇటీవల ప్రభుత్వం 16 వేలకు పైగా డీఎస్సీ పోస్టులను ప్రకటించడంతో నిరుద్యోగులు పెద్ద ఎత్తున లైబ్రరీకి వస్తున్నారు. గ్రూప్-1, గ్రూప్-2తో పాటు ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులు రోజూ వచ్చి చదువుకుంటున్నారు. ఇంటి వద్ద ఇబ్బంది ఉందని గ్రంథాలయానికి వచ్చే నిరుద్యోగుల భద్రత గాల్లో దీపంలా మారింది.
బస్సులో మినీ లైబ్రరీ - యువ డ్రైవర్ వినూత్న ఆలోచన - MINI LIBRARY IN BUS
భవన నిర్మించి 40 సంవత్సరాలు పూర్తవ్వగా నిర్వహణ లేక చాలా చోట్ల గోడలు బీటలు వారాయి. పైకప్పు పెచ్చులూడి కింద పడుతోంది. అసలే వర్షాకాలం, ఆపైన భవనం శిథిలావస్థకు చేరి పెచ్చులు ఊడుతుండటంతో విద్యార్థులు, నిరుద్యోగులు బిక్కుబిక్కుమంటున్నారు. ఏ క్షణాన ఏం జరుగుతుంతో తెలియడం లేదని ఆందోళన చెందుతున్నారు. స్వయానా గ్రంథాలయ కార్యదర్శి పేరుతో వెలసిన పోస్టర్ భవనం దుస్థితిని కళ్లకు కడుతోంది.
పాత భవనం కావడంతో పెచ్చులు ఊడిపోతున్నాయి. రోజు సుమారు 300 మందికిపైగా గ్రంథాలయానికి వస్తున్నారు. ప్రభుత్వం నూతన భవనం కట్టించి ప్రత్యేక డెస్క్లను ఏర్పాటు చేయాలని కోరుతున్నాం. గ్రంథాలయం విద్యార్థులకు ఒక దేవాలయంలా ఉపయోగపడుతుంది. ప్రస్తుత పరిస్థితులు భయానకంగా ఉన్నాయి. - స్థానికులు
గ్రంథాలయంలో సౌకర్యాలూ అంతంత మాత్రమే. ఫ్యాన్లు ఉన్నా కొన్ని పని చేయడం లేదు. సుమారు 100 మంది మహిళా అభ్యర్థులు ప్రతిరోజూ లైబ్రరీకి వస్తుండగా సరైన మరుగుదొడ్లు లేక ఇబ్బంది పడుతున్నారు. గ్రంథాలయ దుస్థితిపై ప్రభుత్వం దృష్టి సారించాలని విద్యార్థులు, నిరుద్యోగులు కోరుతున్నారు. ఏదైనా జరిగిన తర్వాత హడావుడి చేయడం కంటే ముందే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలంటున్నారు.
డిజిటల్ యుగంలోనూ పుస్తక పఠనంపై పెరుగుతోన్న ఆసక్తి - Youth interested For Reading Books