Two Youngmen Died due to Electric Shock : గణతంత్ర దినోత్సవ వేడుకల వేళ ములుగు జిల్లా కేంద్రంలో విషాదం చోటుచేసుకుంది. స్థానిక ఎస్సీ కాలనీలో జాతీయ జెండా ఆవిష్కరణకు ఏర్పాట్లు చేస్తుండగా ముగ్గురు యువకులు ప్రమాదానికి గురయ్యారు. గద్దెపై ఐరన్ పోల్‌ను నాటుతుండగా అది కాస్తా పైన ఉన్న విద్యుత్ వైర్లకు తాకడంతో ల్యాడ విజయ్, అంజిత్, చక్రిలు కరెంట్ షాక్‌తో అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. గమనించిన స్థానికులు హుటాహుటిన వారిని ములుగు ఏరియా ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన విజయ్, అంజిత్లు చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆ ఇద్దరికి సీపీఆర్ చేసినా ఫలితం లేకపోయింది. స్వల్ప గాయాలైన చక్రి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
రిపబ్లిక్ డే వేడుకల కోసం ఏర్పాట్లు చేస్తూ ఇద్దరు యువకులు మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆసుపత్రి వద్ద బాధిత కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. విషయం తెలుసుకున్న మంత్రి సీతక్క హాస్పిటల్‌కు చేరుకొని మృతి చెందిన విజయ్, అంజిత్ కుటుంబసభ్యులకు సానుభూతి తెలిపారు. తక్షణ సాయంగా ఇద్దరి కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున ఆర్థిక సాయం అందజేశారు. విద్యుత్ శాఖ తరఫున బాధిత కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఊళ్లల్లో కానీ, పొలాల్లో కానీ ఎక్కడైనా విద్యుత్ వైర్లు ప్రమాదకర స్థితిలో ఉంటే విద్యుత్ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు.
కరెంట్ షాక్ తగిలి ఏనుగు మృతి.. లైవ్ వీడియో వైరల్!