11 Month Old Baby In Orphanage:తెలంగాణలోని మహబూబ్‌నగర్‌లోని శిశుగృహలో మంగళవారం మధ్యాహ్నం ఆసక్తి కర సంఘటన చోటు చేసుకుంది. శిశుగృహానికి ఓ పాపతో ఇద్దరు తల్లులు వచ్చారు. ఒక్కరు కన్నతల్లి కాగా, మరొకరు పెంచిన తల్లి. ఇద్దరు కలిసి తమ బిడ్డను శిశుగృహంలో వదిలి వెళ్లడానికి వచ్చారు. పేగుబంధం, పెంచిన బంధాన్ని వదులుకున్నారు. ఈ విషయం తెలియని 11 నెలల చిన్నారి గుక్కపట్టి ఏడుస్తోంది. ఆ పాప ఏడ్పులు సైతం వారిని కదిలించలేకపోయాయి. ఇద్దరు తల్లులు ఉన్నా, ఎవ్వరు లేని అనాథగా మారి శిశు గృహానికి చేరిన ఓ చిన్నారి కథ.
మహబూబ్‌నగర్‌కు చెందిన రేణుక, లింగం దంపతులు రోజుకూలి చేస్తూ జీవనం సాగించేవారు. వాళ్లకు ఇద్దరు కుమార్తెలు. రేణుక మూడోసారి గర్భం దాల్చిన నాలుగు నెలలకే ఆమె భర్త లింగం అనారోగ్యంతో మృతి చెందారు. అసలే పేదరికం, ఆపై భర్త కూడా దూరమయ్యారు. బంధువుల సాయంతో ఎలాగోలా జీవించసాగింది. 11 నెలల కిందట మహబూబ్‌నగర్ ప్రభుత్వాసుపత్రిలో ఆమె పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది.
ముగ్గురు పిల్లలను ఎలా పెంచాలో అర్థమవక దిక్కుతోచని పరిస్థితిలో ఉంది. అప్పుడే, హన్వాడ మండలం కొత్తపేటకు చెందిన మణెమ్మ, చెన్నయ్య దంపతులు అదే ఆసుపత్రిలో తమ బంధువులను కలిసేందుకు వచ్చారు. రేణుక పరిస్థితిని తెలుసుకున్నారు. ఆ దంపతుల హృదయం ద్రవించింది. వారికి సంతానం లేదు. దేవుడే తమకు కూతుర్ని ప్రసాదించాడేమోనంటూ ముద్దులొలికే బిడ్డను అక్కున చేర్చుకున్నారు. ఆ పాపకు జెస్సికా అని పేరు పెట్టుకున్నారు. చెన్నయ్య మేస్త్రీ పని చేసేవాడు. ఇక తన కుమార్తెకు ప్రతినెలా పుట్టిన తేదీన కేక్ కోసి పండగలా చేసేవారు.