TTD Modernized Sub Enquiry Office :తిరుమల శ్రీవారి భక్తులు సులభంగా వసతి పొందేలా టీటీడీ మరిన్ని చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా తిరుమలలోని జీఎన్సీ (Garudadri Nagar Cottage) సబ్ ఎంక్వైరీ కార్యాలయాలను ఆధునీకరించింది. కరెంట్ బుకింగ్ కింద గదులు పొందే భక్తులు ఇబ్బందులు పడకుండా సబ్ ఎన్‌క్వైరీలో నగదు చెల్లించి వసతి సౌకర్యం పొందవచ్చని ఈవో తెలిపారు.
శ్రీవారి దర్శనానికి సుదూర ప్రాంతాల నుంచి తరలివచ్చే సామాన్యభక్తులకు సులభంగా వసతి పొందేలా చర్యలు చేపట్టామని టీటీడీ ఈవో శ్యామలరావు చెప్పారు. ఇందులో భాగంగా ఇటీవల ఆధునీకరించిన జీఎన్సీ సబ్ ఎంక్వైరీ కార్యాలయాన్ని అదనపు ఈఓ వెంకయ్యచౌదరి, జేఈఓ గౌతమి, సీవీఎస్వో శ్రీధర్‌తో కలిసి ఈవో శ్యామలరావు పూజ చేసి ప్రారంభించారు. తిరుమలలోని అన్ని వసతి గదులు, విశ్రాంతి గృహాలు వద్ద సర్వే చేపట్టి మెరుగైన సౌకర్యాలు ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. తిరుమలలోని 42 సబ్ ఎంక్వైరీ ఆఫీసులను ఆధునీకరిస్తున్నామన్నారు.
కరెంట్ బుకింగ్ కింద గదులు పొందే భక్తులు ఇబ్బందులు లేకుండా వారు పొందిన కాటేజీకి సంభందించిన సబ్ ఎంక్వైరీలో నగదు చెల్లించి వసతి సౌకర్యం తీసుకునే విధంగా ఏర్పాట్లు జరుగుతున్నాయని ఈవో చెప్పారు. సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి, ఎప్పటికప్పుడు లోటుపాట్లను సరి చేసుకుంటూ భక్తులకు మరింత మెరుగైన వసతి సదుపాయం కల్పించడమే తమ లక్ష్యమని అదనపు ఈవో వెంకయ్య చౌదరి చెప్పారు. గదుల కరెంట్ బుకింగ్‌లో సెంట్రల్ ఎంక్వైరీ ఆఫీసుపై అధిక భారం పడుతుండటంతో గదుల కేటాయింపు ప్రక్రియను డీసెంట్రలైజ్ చేసినట్లు చెప్పారు. సబ్ ఎంక్వైరీ ఆఫీసుల వద్ద గదులు పొందడం, ఖాళీ చేయడం సులభతరమవుతుందని తెలియజేశారు.