TTD Chairman BR Naidu Media Conference: టీటీడీ ఛైర్మన్‌గా నియమితులైన బీఆర్ నాయుడు తొలిసారి మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్ మీడియాతో మాట్లాడిన ఆయన, తనను ఛైర్మన్‌గా నియమించినందుకు సీఎం చంద్రబాబు, ఎన్డీయే పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు. తన జీవితంలో ఇదో కొత్త మలుపుగా భావిస్తున్నానని అన్నారు. గత ప్రభుత్వం తిరుమలలో చాలా అరాచకాలు చేసిందని, దీని కారణంగా తాను గత ఐదేళ్లలో ఒక్కసారి కూడా తిరుమలకు వెళ్లలేదన్నారు.
గత ఐదేళ్లలో ఒక్కసారి కూడా వెళ్లలేదు: చిత్తూరు వైపు ఏ చిన్న కష్టం వచ్చినా కొండకు వెళ్తామంటారని, తిరుమలను కొండ అని పిలుస్తారని అన్నారు. ఇవాళ్టికీ అదే ఆనవాయితీ కొనసాగుతోందన్నారు. వైఎస్సార్సీపీ హయాంలో తిరుమల పవిత్రత లేకపోయేసరికి చాలా బాధపడ్డానన్నారు. గతంలో ఏడాదికి ఐదారుసార్లు తిరుమల వెళ్లేవాడినని, గత ఐదేళ్లలో ఒక్కసారి కూడా వెళ్లలేదంటే తన బాధ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఇప్పటికే చంద్రబాబుతో అన్ని విషయాలు మాట్లాడానని, బాధ్యతలు తీసుకున్న తర్వాత వస్తే మాట్లాడదామని ఆయన చెప్పారన్నారు.
నీతి, నిజాయతీగా పనిచేయాలనేదే నా కోరిక: చర్చించిన అంశాలన్నీ బోర్డు మీటింగ్‌లో పెట్టి నిర్ణయం తీసుకుందామని చెప్పారని, చంద్రబాబు సలహాలు, సూచనలతో ముందుకెళ్తామని స్పష్టం చేశారు. తాను 1982 నుంచి టీడీపీలో పనిచేస్తున్నానని, పార్టీలో కూడా నాకు చాలా అనుభవం ఉందన్నారు. ప్రతి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటానని, స్వామీజీలతో కూడా పరిచయాలు ఉన్నాయని తెలిపారు. హిందూధర్మం ఛానల్ కూడా ఏర్పాటు చేశానన్న బీఆర్ నాయుడు, నీతి, నిజాయతీగా పనిచేయాలనేదే తన కోరిక అని వెల్లడించారు.
జీవితంలో నేనేమీ తప్పు చేయలేదు: సొంత డబ్బుతో తిరుమలకు సేవచేయాలనుకుంటున్నామన్న ఆయన, తనపై విమర్శలకు ఎలా సమాధానం చెప్పాలో తనకు తెలుసన్నారు. తిరుమల పవిత్రతను కాపాడాలని ప్రతిఒక్కరిని కోరుతున్నానని, తిరుమలలో పనిచేసేవాళ్లు ప్రతిఒక్కరూ హిందువై ఉండాలనేదే తన ప్రయత్నమని స్పష్టంచేశారు. తిరుమలలో ఎక్కడా దుర్గంధం లేకుండా చర్యలు తీసుకుంటామని, ప్రతి విషయాన్ని బోర్డు మీటింగ్‌లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. శ్రీవారికి సేవ చేయాలనే ఆలోచనలతోనే వచ్చానని, జీవితంలో తానేమీ తప్పు చేయలేదని పేర్కొన్నారు.
శ్రీవాణి ట్రస్టు రద్దు చేయాలనేది నా ఆలోచన: భక్తులను ఎక్కువసేపు కంపార్టుమెంట్లలో ఉంచడం మంచిదికాదన్న ఆయన, చిన్నపిల్లలను కంపార్టుమెంట్లలో ఎక్కువసేపు ఉంచితే చాలా బాధపడతారని తెలిపారు. గత ఐదేళ్లు కంపార్టుమెంట్లలో పిల్లలకు పాలు కూడా ఇచ్చింది లేదని, కొత్త ప్రభుత్వం వచ్చాక పిల్లలకు పాలు, అల్పాహారం పెడుతున్నారని అన్నారు. శ్రీవాణి ట్రస్టు రద్దు చేయాలనేది తన ఆలోచన అని స్పష్టంచేశారు. ఒక పెద్ద ట్రస్టు ఉన్నప్పుడు మరో ట్రస్టు ఎందుకని ప్రశ్నించారు.
గతంలో ఉన్న పద్ధతిని మళ్లీ తీసుకొస్తాం: టికెట్ల విషయంలో ఆలోచన చేస్తామని, గతంలో ఉన్న పద్ధతిని మళ్లీ తీసుకొస్తామన్నారు. మెటీరియల్ సప్లయ్, ఆలయ భూములపై ప్రత్యేక కమిటీలు వేస్తామని, తిరుమలలోని యూనివర్సిటీ, ఆస్పత్రులపై దృష్టిసారిస్తామని బీఆర్ నాయుడు స్పష్టం చేశారు. కొండపై గాజు సీసాల్లో నీళ్లు భక్తులకు భారంగా మారాయన్న ఆయన, వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేసి పేపర్ గ్లాసులు ఉచితంగా ఇవ్వాలనే ఆలోచన చేస్తున్నామన్నారు.
24 మంది సభ్యులతో టీటీడీ బోర్డు - ఛైర్మన్‌గా బీఆర్ నాయుడు