Maha Shanti Homam in Tirumala to Purify Temple : తిరుమల శ్రీవారి ఆలయంలో మహా శాంతి హోమం ప్రారంభమైంది. శ్రీవారి నైవేద్యాలు, లడ్డూ నెయ్యిలో కల్తీ జరిగిన నేపథ్యంలో ప్రాయశ్చిత్తం కోసం అర్చకులు, అధికారులు శాంతిహోమం నిర్వహించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆలయంలోని యాగశాల వద్ద ఉదయం 6 గంటల నుంచి ప్రారంభించిన ఈ హోమం 10 గంటల వరకు జరపనున్నారు. అనంతరం పంచగ్రవ్య సంప్రోక్షణ చేయనున్నారు.
శ్రీవారికి వాడే ఆవు నెయ్యిలో దోషం ఉండటం వల్ల అపచారం కలిగిందని టీటీడీ ఈవో శ్యామలరావు అన్నారు. ఈ అపచారానికి ప్రాయశ్చిత్తంగా శాంతిహోమం నిర్వహిస్తున్నామని తెలిపారు. హోమం తర్వాత అన్ని పోటుల్లో సంప్రోక్షణ చేస్తామని వెల్లడించారు. లడ్డూ కోసం స్వచ్ఛమైన నెయ్యి కొనుగోలు చేస్తున్నామని స్పష్టం చేశారు. నెయ్యి స్వచ్ఛతను తేల్చేందుకు 18 మందితో ల్యాబ్ ప్యానెల్‌ను ఏర్పాటు చేశామన్నారు. ఆగస్టులో నిర్వహించిన పవిత్రోత్సవాలతో లడ్డూ కల్తీ అపచారం తొలగిపోయిందని పేర్కొన్నారు. అయినప్పటికీ భక్తుల్లో ఆందోళన తొలగించేందుకు ఇవాళ శాంతి హోమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
పవిత్రోత్సవాలతో తిరుమల సంప్రోక్షణ : తిరుమల లడ్డూ అపవిత్రమైన నేపథ్యంలో భక్తుల్లో విశ్వాసం నింపేందుకు తగిన చర్యలు చేపట్టామని టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు. గుర్తింపు పొందిన సంస్థల నుంచి స్వచ్ఛమైన నెయ్యి కొనుగోలు చేస్తున్నామని వెల్లడించారు. నెయ్యి నాణ్యతను పరీక్షించేందుకు తగిన ప్రయోగశాలలు ఏర్పాటు చేస్తున్నామని ఈవో తెలిపారు. ఎన్ఏబీఎల్ ల్యాబ్‌కు నెయ్యి నమూనాలు పంపించే విధానాన్ని ప్రారంభించామని తెలిపారు.