TSRTC Special Buses To Medaram Jatara 2024 : ములుగు జిల్లా మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర ఈ నెల 21 నుంచి 24 వరకు జరుగనుంది. మేడారంలో 55 ఎకరాల్లో ఏర్పాటు చేసిన తాత్కాలిక బస్టాండ్, బేస్ క్యాంప్, 48 క్యూ రెయిలింగ్స్‌ను మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. జాతరను టీఎస్ఆర్టీసీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుందని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వివరించారు. జాతరకు టీఎస్ఆర్టీసీ స్పెషల్ బస్సులు అందుబాటులో ఉంటాయని సంస్థ ఎండీ సజ్జనార్ వెల్లడించారు. కమాండ్ కంట్రోల్ రూం, సీసీ టీవీ కెమెరాలు అందుబాటులో ఉంచామని పేర్కొన్నారు. బస్సులు మార్గ మధ్యలో ఎక్కడా ఆగకుండా 25 ఛేజింగ్ స్కాడ్ టీమ్‌లను ఏర్పాటు చేశామని ఆయన వెల్లడించారు.
Medaram Jatara 2024 : రెండేళ్లకోసారి వచ్చే మేడారంమహాజాతరను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. జాతరకు పది రోజుల ముందే అన్ని అభివృద్ధి పనులు పూర్తిచేసి అందుబాటులోకి తెస్తామన్నారు. సమ్మక్క-సారలమ్మ జాతరకు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం అందుబాటులో ఉన్నందున ఆ మేరకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. మహాలక్ష్మి పథకం ద్వారా ఇప్పటి వరకు 14.50 కోట్ల మంది మహిళలు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని వినియోగించుకున్నారని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు.
మేడారం జాతర గురించి మంత్రులు పొన్నం, సీతక్కల ఆసక్తికర సంభాషణ - వీడియో వైరల్
''మేడారం జాతరను టీఎస్ఆర్టీసీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. మహాలక్ష్మి పథకం ద్వారా ఇప్పటి వరకు 14.50 కోట్ల మంది మహిళలు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని వినియోగించుకున్నారు. జాతరకు కూడా మహిళలకు ఫ్రీ ప్రయాణమే ఉంటుంది. " - సజ్జనార్, టీఎస్ఆర్టీసీ ఎండీ