Trolls on CM Jagan National Media Interviews :అణువణువునా అతిశయం, అహంభావం. నోరు తెరిస్తే అబద్ధం. మూర్తీభవించిన ఫ్యూడల్ స్వభావం. సంక్లిష్టమైన ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి వచ్చినప్పుడు గోడమీద పిల్లివాటం కొన్ని ప్రశ్నలకు మౌనం, విచిత్ర హావభావాలే సమాధానం! ఇదీ ఇటీవల రెండు జాతీయ టీవీ ఛానళ్లతో సీఎం జగన్ ఇంటర్వ్యూలు సాగిన తీరు. ఎన్నికల్లో తన పార్టీకి ఎదురే లేదని, ప్రజలు తనను, తన పాలనను చూసి మాత్రమే ఓట్లేస్తారు తప్ప, అభ్యర్థులు ఎవరన్నది అప్రస్తుతమని అహంభావాన్ని చాటుకున్నారు.
ఒక కుటుంబం నుంచి ఒక తరంలో ఒకరే రాజకీయాల్లో ఉండాలని, అందుకే చెల్లెలు షర్మిలను రాజకీయాలకు దూరంగా ఉండమన్నానంటూ కొత్త సిద్ధాంతాన్ని ఆవిష్కరించారు. భారీ పరిశ్రమలతో ఉద్యోగాలేం వస్తాయంటూ పెదవి విరిచేశారు! ఆ ఇంటర్వ్యూల్లో జగన్ సమాధానాలు చెప్పిన తీరుపై సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున ట్రోల్స్ వెల్లువెత్తుతున్నాయి. ఆ ఇంటర్వ్యూల్లో కొన్ని కీలక అంశాలపై జగన్ స్పందన, వాస్తవాలేంటో చూద్దాం.
నేనే హీరో - అభ్యర్థులంతా జీరో : -
జగన్:"ప్రభుత్వంపైన, ముఖ్యమంత్రిగా నాపైన ప్రజల్లో వ్యతిరేకత లేదు. కొందరు ఎమ్మెల్యేలపై అసంతృప్తి ఉంటుంది. ప్రజలు నన్ను చూసే ఓటేస్తారు. ఇది ఎంపీ, ఎమ్మెల్యేలను ఎన్నుకోవడానికి జరుగుతున్న ఎన్నిక కాదని, భవిష్యత్తును మలుపుతిప్పే ఎన్నిక అని ప్రచారంలో పదే పదే చెబుతున్నాను."
మీరు మాత్రమే హీరో అభ్యర్థులంతా డమ్మీలని చెప్పదలుచుకున్నారా? మిమ్మల్ని చూసే ఓటేస్తారని అంత నమ్మకం ఉన్నప్పుడు పెద్ద సంఖ్యలో అభ్యర్థులను ఎందుకు మార్చారు? ఏ భవిష్యత్తు కోసం ప్రజలు మీకు ఓటేయాలి జగన్? ఐదేళ్లలో రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసినందుకా? అప్పుల కుప్పగా మార్చేసినందుకా? అని ప్రజలు నిలదీస్తున్నారు.
మీది ఏ హార్వర్డ్ బిజినెస్ స్కూల్లోనో పాఠాలు చెప్పాల్సిన స్థాయి! :
జగన్:"మీరు ఏ గ్రామంలోకైనా వెళ్లండి. సచివాలయం కనిపిస్తుంది. నాలుగు అడుగులేస్తే రైతు భరోసా కేంద్రం ఉంటుంది, మరికొద్ది దూరంలో విలేజ్ క్లినిక్ కనిపిస్తుంది. వాలంటీర్లు ఉన్నారు. ఇంగ్లిషు మీడియం స్కూల్ ఉంది. ఇవన్నీ గ్రామ పురోగతికి తోడ్పడతాయి. అయినా ప్రభుత్వం వల్ల, భారీ పరిశ్రమల వల్ల వచ్చే ఉద్యోగాలెన్ని? ఎంఎస్‌ఎంఈలు, స్వయం ఉపాధి రంగాల వల్లే ఉద్యోగాలు వస్తాయి. మత్స్యకారులు, వీధి వ్యాపారులు, ఆటోడ్రైవర్లు వంటివారికి చేయూతనివ్వకపోతే గ్రోత్ ఎలా వస్తుంది?" అంటూ జగన్ తనదైన 'అభివృద్ధి నమూనా'ను ఆవిష్కరించారు.