Tribes Facing Severe Problems Due to Heavy Rains : అల్లూరి సీతారామరాజు జిల్లాలోని జి.కె వీధి మండలంలోని గిరిజన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 60 ఏళ్లలో చూడని వర్షాలు, ఉగ్ర రూపంలో పొంగిన గెడ్డలు గిరిజన గ్రామాలను కకావికలం చేశాయి. సర్వం కోల్పోయిన గిరి పుత్రులు బరువెక్కిన బతుకులతో ఆదుకునే వారి కోసం ఎదురు చూస్తున్నారు. వర్షాలకు కొండ చెరియలు విరిగి, భూమి కోతకు గురై వందల గ్రామాల్లోని పంట భూముల మీదుగా నీరు ప్రవహించింది. గ్రామాలను ఆనుకుని ఉన్న పంట భూములు సహా మొత్తాన్ని తుడిచిపెట్టేసింది. వరదల్లో కొందరు గాయపడ్డారు. కొన్ని చోట్ల పంట పొలాల్లో నీరు ఇప్పటికీ ప్రవహిస్తున్నది. గ్రామాల మీదుగా భారీగా వరద నీరు ప్రవహించడంతో గిరిజనులు పడ్డ కష్టం వర్ణనాతీతం.
నామరూపాలు లేకుండా : గత 60 ఏళ్ల కాలంలో ఈ తరహా భారీ వర్షాలను తాము చూడలేదని గిరిజనులు చెప్తున్నారు. ఒక్కసారిగా గెడ్డలు పొంగి వరద నీరు గిరిజనుల నివాసాల్లోకి చేరి తీవ్ర నష్టం జరిగింది. వరద సమయంలో ఎత్తున ఉన్న రోడ్లపైనా మూడు అడుగుల మేర వరద నీరు ప్రవహించింది. ఆరు పంచాయతీలలో గిరిజనలు సాగు చేసుకుంటున్న వందలాది ఎకరాల భూమి భారీ వర్షం దాటికి నామరూపాలు కూడా లేకుండా పోయింది. ఇప్పటికీ పంటపొలాలు చిన్నపాటి నదుల్ని, వాగుల్ని తలపిస్తున్నాయి. దారకొండ పంచాయితీ పరిధిలో రెండు కిలోమీటర్ అవతల ఉన్న కొండ కరిగి మాది మల్లు గ్రామానికి భారీ వృక్షాలు, పెద్ద పెద్ద బండరాళ్లు కొట్టుకు వచ్చాయి. పంట పొలాలన్ని వాగులను తలపిస్తున్నాయి. కొన్ని ఇళ్లను నామారూపాలు లేకుండా చేసింది. ప్రాణ నష్టం జరగక పోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.