Train And Bus Reservation Filled Due To Sankranti Festival : సంక్రాంతి పండక్కి సొంతూళ్లకు వెళ్లేందుకు తెలుగు రాష్ట్రాల ప్రజలు భారీసంఖ్యలో సిద్ధమవుతున్నారు. అయితే ప్రయాణానికి మాత్రం భారీ ‘వ్యయ’ప్రయాసలు తప్పడం లేదు. రైళ్లలో ఇప్పటికే రిజర్వేషన్లు అయిపోగా ఆర్టీసీ బస్సుల్లోనూ దాదాపు టికెట్లు దొరకని పరిస్థితి ఉంది. విమాన టికెట్ల ధరలకూ రెక్కలొచ్చాయి. దీంతో పలు ప్రైవేటు బస్సుల యజమానులు అడ్డగోలు దోపిడీకి తెరతీస్తున్నారు. పండక్కి ఎలాగైనా సొంతూళ్లకు చేరుకోవాలన్న లక్ష్యంతో ప్రజలు సిద్ధమవుతుండటంతో ఇదే అదనుగా ఛార్జీలు పెంచేస్తున్నారు. ప్రైవేటు స్లీపర్ ఏసీ బస్సుల్లో హైదరాబాద్ నుంచి విశాఖపట్నానికి గరిష్ఠంగా రూ.7వేలకు పైగా వసూలు చేస్తున్నారు. ఆదిలాబాద్‌కు రూ.2,300, మంచిర్యాలకు రూ.3,500 తీసుకుంటున్నారు. జనవరి 9 నుంచి 12 వరకు రైళ్లు, బస్సులు, విమాన టికెట్లకు డిమాండ్ అధికంగా ఉంది.
భగ్గుమంటున్న టికెట్ల ధరలు :
సంక్రాంతి పండగ దగ్గరపడే కొద్దీ ప్రైవేటు బస్సుల్లో టికెట్ల ధరలు భగ్గుమంటున్నాయి. దూరప్రాంతాలకు వెళ్లేవారు స్లీపర్ బస్సులకు ప్రాధాన్యమిస్తారు. దీంతో లోయర్ బెర్తులకు, కొన్ని బస్సుల్లో ముందువరుస సీట్లకు అదనంగా వసూలు చేస్తున్నారు. టికెట్ ఛార్జీలపై జీఎస్టీ కూడా వసూలుచేస్తున్నారు. జనవరి 12న హైదరాబాద్ నుంచి విశాఖకు ఓ ప్రైవేటు ఏసీ స్లీపర్ బస్సులో టికెట్ ధర రూ.6,999, జీఎస్టీ రూ.349.95 కలిపి మొత్తం రూ.7,348.95 వసూలు చేస్తున్నారు. తెలంగాణలో ఖమ్మం, భద్రాద్రి-కొత్తగూడెం, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలకు బస్సుల డిమాండ్ అధికంగా ఉంది. ఆర్టీసీతో పాటు ప్రైవేటు ఆపరేటర్లూ అదనపు బస్సులు నడుపుతున్నారు.
హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్‌కు జనవరి 13న ఆర్టీసీ స్లీపర్ బస్సులో సీటు టికెట్ రూ.810. అదే ఓ ప్రైవేట్ బస్సులో ఛార్జి రూ.1,200. స్లీపర్ బెర్తు టికెట్‌కు ఆర్టీసీ బస్సుల్లో రూ.1,040 అయితే ఓ ప్రైవేటు బస్సులో ధర రూ.2,300. మంచిర్యాలకు ఆర్టీసీ బస్సులో బెర్తు ధర రూ.860 అయితే ఓ ప్రైవేట్ బస్సులో ఏకంగా రూ.3,700గా నిర్ణయించారు.
విమాన ఛార్జీలకూ రెక్కలు!
విమాన ప్రయాణ టికెట్లు సైతం దాదాపు మూడింతలు అయ్యాయి. దూరప్రాంతాలకు ప్రయాణ సమయం ఒకట్రెండు గంటలే కావడంతో విమానాల్లో 11, 12 తేదీల్లో ఎక్కువమంది వెళుతున్నారు. జనవరి 11న హైదరాబాద్-విశాఖపట్నం టికెట్ ధరలు రూ.10,019 నుంచి రూ.13,536 వరకు ఉన్నాయి. సాధారణ రోజుల్లో టికెట్ సుమారు రూ.3,900 ఉంటుంది.
హైదరాబాద్-విజయవాడ విమాన టికెట్ సాధారణంగా రూ.2,600కే దొరుకుతుంది. సంక్రాంతి సమయంలో కనీస ధర రూ.6,981, గరిష్ఠంగా రూ.16వేలకు పైగా ఉంది. హైదరాబాద్ నుంచి రాజమహేంద్రవరం విమాన టికెట్ల ధరలు 10-12 తేదీల్లో కనిష్ఠంగా రూ.7,135, గరిష్ఠంగా రూ.15వేలకు పైగా ఉన్నాయి.
ఛార్జీల నియంత్రణపై చర్యలేవీ!
ప్రైవేటు ఆపరేటర్లు అడ్డగోలుగా ఛార్జీలు పెంచుతున్నా నియంత్రించడంలో తెలంగాణ రవాణాశాఖ ప్రేక్షకపాత్ర పోషిస్తోంది. ఛార్జీల దోపిడీ వెబ్‌సైట్లు, యాప్‌లలో కనిపిస్తున్నా కట్టడికి అధికారులు ప్రయత్నాలు చేయడం లేదు.