తెలంగాణ

telangana

ETV Bharat / state

అన్నదాతలకు బోనస్ అందకుండా చేస్తున్న మిల్లర్లు - నేరుగా కల్లాల నుంచే సన్నాలు కొనుగోలు చేస్తూ? - DEMAND FOR FINE GRAINS IN TELANGANA

మార్కెట్​లో మంచి డిమాండ్​ ఉన్న తెలంగాణ సన్నాలు - సన్నాల సేకరణకు పోటీపడుతున్న వ్యాపారులు, మిల్లర్లు - ప్రభుత్వ ధాన్యం సేకరణ కేంద్రాలకు తక్కువగా వెళుతున్న సన్నాలు

Grain Procurement in Telangana
Grain Procurement in Telangana (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Nov 15, 2024, 12:47 PM IST

Grain Procurement in Telangana :రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.500 బోనస్​తో సన్నాలు భారీ ఎత్తున సాగయ్యాయి.. ఆ మేరకు దిగుబడీ వస్తోంది. ఇప్పుడు ఈ సన్నాలపై వ్యాపారులు, మిల్లర్ల కన్నుపడింది. వాటిని కల్లాల నుంచే పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తున్నారు. దీంతో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు ఆశించిన మేరకు అవి రావడం లేదు. ఈ విషయం క్షేత్రస్థాయి పరిస్థితులను చూస్తే తెలుస్తోంది. కొన్ని చోట్లైటే దళారులను గ్రామాల్లోకి పంపించి పోటాపోటీగా కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వ కేంద్రాల్లో దాదాపు 1.81 లక్షల టన్నుల కొనుగోళ్లు జరగ్గా.. మిల్లర్లు, వ్యాపారులు కొన్నవే దీనికి ఐదారు రెట్ల అధికంగా ఉంటుందని సమాచారం.

తెలంగాణ సన్నాలు విదేశాలకు : తెలంగాణ సన్నాలకు దేశ విదేశాల్లో చాలా మంచి గిరాకీ ఉంది. దీన్ని ఆసరాగా చేసుకొని మిల్లర్లు, వ్యాపారులు కొనుగోళ్ల కోసం ఎగబడుతున్నారు. రైతుల నుంచి ధాన్యాన్ని కొని బియ్యంగా మార్చి విదేశాలకు దిగుమతి చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తెలుగు ప్రలు ఎక్కువగా ఉండే.. అలాగే దక్షిణాది రాష్ట్రాల వాసులు అధికంగా ఉండే సౌదీ అరేబియా, సింగపూర్​, యునైటెడ్​ అరబ్​ ఎమిరేట్స్​ వంటి దేశాలకు ఎగుమతులు అధికంగా ఉంటాయని ఓ వ్యాపారి వెల్లడించారు.

అమెరికా, బంగ్లాదేశ్​, ఫిలిప్పీన్స్​ వంటి దేశాల్లో అయితే తెలంగాణ బియ్యానికి మంచి ఉందని, అక్కడకీ కూడా ఎగుమతి చేయనున్నట్లు తెలిపారు. కొన్ని వారాల క్రితమే కేంద్ర ప్రభుత్వం బియ్యం ఎగుమతులపై నిషేధాన్ని ఎత్తేసింది. ఈ పరిస్థితిని వ్యాపారులు, మిల్లర్లు మరింత లాభదాయకందా మలుచుకునేందుకు తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

ధర తగ్గిస్తున్న మిల్లర్లు, వ్యాపారులు : వరి కోతలు పెరుగుతూ ధాన్యం వచ్చేకొద్దీ వ్యాపారులు, మిల్లర్లు ధరను తగ్గిస్తూ వస్తున్నారు. ప్రారంభంలో క్వింటాకు రూ.2,600-రూ.2,700 మధ్య కొని ఇప్పుడు రూ.2,200-రూ.2,300కే కొంటున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం రూ.2,320 మద్దతు ధరతో పాటు రూ.500 బోనస్​ ఇస్తోంది. అయితే ఇక్కడ ప్రభుత్వానికి ధాన్యం విక్రయించాలంటే 17 శాతం తేమ ఉండకుండా ఎండలో ఆరబెట్టాలి. ఇలా అయితే ధాన్యం కోసిన తర్వాత ఐదారు రోజులు కోసి ఎండబెట్టాలి. ఆతర్వాత ధాన్యం బరువు తగ్గడం, కూలీలు తదితర ఖర్చులు ఉండటం అవి తక్కువగా వస్తున్నాయి. అదే వ్యాపారులు, మిల్లర్లు అయితే 30 శాతం తేమ ఉన్నా తీసుకుంటున్నారు. మళ్లీ అప్పుడప్పుడు వర్షాలు పడుతున్నాయి.. దీంతో రైతులు కల్లాల్లోనే మిల్లర్లు, వ్యాపారులకు ధాన్యాన్ని ఎక్కువగా అమ్మేస్తున్నారు.

ఆ జిల్లాల్లోనే సన్నాల సాగు అధికం : ఖరీఫ్​లో రాష్ట్రంలో 23,58,344 ఎకరాల్లో దొడ్డు రకం, 36,80,425 ఎకరాల్లో సన్నాలు ఇలా మొత్తం కలిపి 60,38,769 ఎకరాల్లో వరి సాగు అయింది. దిగుబడి విషయానికి వస్తే సన్నాలు 88.09 లక్షల టన్నులు రాగా.. దొడ్డువి 58.19.. మొత్తం 146.28 లక్షల టన్నుల మేర వస్తుందని అధికారులు అంచనా వేశారు. ఇందులో రైతులు సొంత అవసరాలకు దాచుకునేవి.. వ్యాపారులు, మిల్లర్లు కొనుగోలు చేసేవి పోనూ 91.28 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తుందని అధికారులు భావన. ఇందులో సన్నాలు 48.91 లక్షల టన్నులు కాగా.. దొడ్డువి 42.37 లక్షల టన్నులుగా అంచనా. రాష్ట్రంలో అత్యధికంగా సన్నాలు నిజామాబాద్​ జిల్లాలో సాగయ్యాయి. ఆ తర్వాత నల్గొండ, జగిత్యాల, కామారెడ్డి, ఖమ్మం, పెద్దపల్లి, సిద్దిపేట, కరీంనగర్, మెదక్, యాదాద్రి జిల్లాల్లో సాగయ్యాయి.

పక్క రాష్ట్రాలకు తరలుతున్న సన్నాలు : తెలంగాణలో సన్నాలను కొన్న మిల్లర్లు, వ్యాపారులు నల్గొండ జిల్లా మిర్యాలగూడ వారే ఉన్నట్లు సమాచారం. ఖమ్మం, కొత్తగూడెంలతో పాటు ఇతర జిల్లాల నుంచి ఏపీలోని ఉమ్మడి గోదావరి జిల్లాలకు చెందిన వ్యాపారులు, మిల్లర్లు లక్షల టన్నులు కొన్నట్లు సమాచారం. అదే ఉమ్మడి మహబూబ్​నగర్​కు కర్ణాటకలోని రాయచూరు మార్కెట్​ దగ్గరగా ఉంది.. అక్కడ సన్నాలకు మంచి డిమాండ్​ ఉంది. దీంతో అక్కడకు రైతులు భారీగా వెళుతున్నారు.

తక్కువ ధరకు ప్రైవేట్ వ్యక్తులకు ధాన్యం అమ్మాల్సిన పని లేదు : అన్నదాతలకు సీఎం కీలక సూచన

రూ.500 బోనస్​ ఇచ్చేది ఈ రకాలకే - లిస్ట్​లో మీరు పండించిన ధాన్యం ఉందా? చెక్​ చేసుకోండి

ABOUT THE AUTHOR

...view details