Tourists Disappointment at Pulicat Lake: అందమైన సరస్సు. అందులో రెక్కలు కట్టుకువాలే విదేశీ అతిథులు. పక్షుల కిలకిలారావాలు. కొంగబావ జపాలు. అలా చూస్తూ ఎంతసేపైనా ఉండిపోవచ్చు. రోజంతా గడిపేయొచ్చు. మనసులో ముచ్చటైన జ్ఞాపకాలు మూటకట్టుకోవచ్చు అని అక్కడికి వెళ్లినవారికి నిరాశే మిగులుతోంది. పులికాట్ సరస్సు వెంట గత ఐదేళ్లలో చేపట్టిన నాసిరకం నిర్మాణాలు పర్యాటకులకు ఆహ్లాదం పంచలేకపోతున్నాయి.
అతిపెద్ద మంచినీటి చెరువుగా పేరొందిన పులికాట్ సరస్సు విదేశీ పక్షులకు ఆలవాలం. వేసవిలో విదేశీ విహంగాలు విడిదికి ఎక్కువ సంఖ్యలో వస్తుంటాయి. మిగతా రోజుల్లోనూ పులికాట్‌లో ఎంతో కొంత సందడి కనిపిస్తూనే ఉంటుంది. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గ పరిధిలో వన్యప్రాణి విభాగం కొన్ని పక్షి సంరక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసింది. అక్కడకు వచ్చే పక్షుల సందడిని తిలకించడానికి పర్యాటకులను ఆకర్షించేలా కేంద్ర ప్రభుత్వ స్వదేశీ దర్శన్ పథకం నిధులతో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు.
నేలపట్టుకు 5.32 కోట్ల రూపాయలు, అటకానితిప్పలోని పర్యావరణ కేంద్రంలో అభివృద్ధి పనులకు 1.20 కోట్ల రూపాయలు, వేనాడుకు 2 కోట్ల రూపాయలు మంజూరు చేశారు. ఈ నిధులతో సందర్శకులను ఆకట్టుకునేందుకు వీలుగా పలు రకాల అభివృద్ధి పనులకు డిజైన్లు రూపొందించి పనులు చేపట్టారు. వీటిల్లో చిన్న పిల్లలకు, పెద్దలకు ఆహ్లాదకరంగా ఉండేలా నాలుగు ప్రాంతాల్లో పనులు చేశారు. ఆ డబ్బుతో వైఎస్సార్సీపీ హయాంలో చేపట్టిన నిర్మాణాలు వినియోగంలోకి రాకుండానే శిథిలమవుతున్నాయి.