Tourism issues in Hamsaladeevi In Krishna District :సహజసిద్ధ ప్రకృతి సోయగాలు, పుణ్యక్షేత్రాల వైభవం, ఎక్కడా చూడని అరుదైన జీవజాలం, కృష్ణానది సముద్రంలో కలిసే పరమ పవిత్ర సాగర సంగమం ఇవి పర్యాటకుల మనసును దోచే హంసలదీవి ప్రత్యేకతలు. సముద్రుడి అలల సవ్వడులు కృష్ణానది పరవళ్లతో సందడి చేసే ఈ ప్రాంతంలో సందర్శకులకు మాత్రం కనీస సౌకర్యాలు కరువయ్యాయి.
హంసలదీవి ప్రత్యేకతలు :ఉరుకుల పరుగుల జీవితం నుంచి కాసేపు సేదతీరేందుకు జనాలు పర్యాటక ప్రాంతాలకు తరలివెళ్తున్నారు. కృష్ణా జిల్లాలోని హంసలదీవి తీరం అనేక ప్రత్యేకతలతో జిల్లాతో పాటు చుట్టూ పక్కల ప్రాంతాల పర్యాటకులను ఆకర్షిస్తోంది. కృష్ణా వన్యప్రాణి అభయారణ్యం పరిధిలో ఉండటంతో పచ్చటి మడ అడవులు, బుడిబుడి అడుగుల తాబేళ్లు, ఎర్రటి పీతలు, నేలపై ఆడుకునే మొప్పడాయ చేపలు, నక్కలు, రకరకాల పక్షులు ఇలా ఒకటేమిటి సమస్త జీవరాశి ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. తీరప్రాంతంలో పకృతి సౌందర్యానికి, ఆహ్లాదానికి ఎంతో మంది తన్మయులవుతున్నారు. అందుకే ఎక్కడెక్కడి నుంచో ఇక్కడికి వచ్చి సేదతీరుతున్నారు.
గుంతలమయంగా మారి పర్యాటకుల ఇక్కట్లు : కోడూరు మండలంలోని హంసలదీవి, పాలకాయతిప్ప గ్రామాల సమీపంలో జీవవైవిధ్యంతో కూడిన కృష్ణా వన్యప్రాణి అభయారణ్యం విస్తరించి ఉంది. ఇక్కడ బావురు పిల్లి, గుంట నక్క, నీటి కుక్క, డాల్పిన్లు వంటి అరుదైన జీవజాల సంచారం పర్యాటకులకు కనువిందు చేస్తోంది. గతంలో సాగరసంగమ ప్రాంతంలో పలు చిత్రాలు, సీరియల్స్, షార్ట్‌ఫిల్మ్‌ల చిత్రీకరణలూ చేపట్టారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ నిర్లక్ష్యంతో రోడ్లు నిర్మాణాలను చేపట్టకపోవడంతో అవనిగడ్డ నుంచి కోడూరు వరకు రహదారి గుంతలమయంగా మారి పర్యాటకులు ఇక్కడకు వచ్చేందుకు వెనకడుగు వేస్తున్నారు.