Tourism Development Organization Has No Incentive From Government: జగన్ జమానాలో రాష్ట్రంలో పర్యాటకాభివృద్ధి పడకేసింది. ఏపీలో పర్యాటక రంగం అభివృద్ధికి అప్పులివ్వడానికి బ్యాంకులే కాదు పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలూ ముందుకు రాలేదు. గతేడాది విశాఖ వేదికగా నిర్వహించిన పెట్టుబడుదారుల సదస్సులో 17 వేల 127 కోట్ల రూపాయిల పెట్టుబడులకు ఒప్పందాలు కుదుర్చుకున్నాని ప్రభుత్వం ఘనంగా ప్రకటించుకుంది. ఏకంగా 39 వేల 170 మందికి ఉద్యోగాలు లభిస్తాయని ఆశలు రేపింది. కానీ ఆ ఒప్పందాల్లో కేవలం 3 వేల 94 కోట్ల రూపాయిల పెట్టుబడులు మాత్రమే సాకారమయ్యాయి. మొత్తం 20 ప్రాజెక్టులు చేపట్టగా కేవలం మూడే ప్రారంభమయ్యాయి. విజయవాడలో ఒక హోటల్, బాపట్లలో బీచ్ రిసార్టు, సత్యసాయి జిల్లాలో వెల్‌నెస్ సెంటర్ మినహా మిగిలిన 17 ప్రాజెక్టుల పనులు వివిధ దశల్లోనే ఉన్నాయి. మిగిలిన సంస్థలతో పెట్టుబడులు పెట్టించేలా రెండు ఉన్నత స్థాయి కమిటీలు ఏర్పాటు చేశామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ ఫలితం కనిపించడం లేదు.
అంతా జగన్నాటకం - రాష్ట్రంలో పడకేసిన పర్యాటకం
పెట్టుబడులపై ప్రభుత్వ రాయితీలు కాగితాలకే పరిమితమవడంతో ఎక్కువ మంది ఆసక్తి చూపడం లేదు. పెట్టుబడులు పెట్టి హోటళ్లు ప్రారంభించే వారికి ఏపీ జీఎస్టీ ఐదేళ్ల వరకు మినహాయింపు, బార్ల ఫీజుల్లో రాయితీ వంటివి సరిగా అమలుకావడం లేదు. హోటళ్ల నిర్వాహకుల నుంచి ప్రభుత్వం ముక్కుపిండి వసూలు చేస్తోంది. ఈ ఏడాది జనవరి 29 నుంచి 31 వరకూ 3 రోజులపాటు విశాఖలో నిర్వహించిన దక్షిణ భారత హోటళ్ల అసోసియేషన్ సదస్సులో రాష్ట్ర ప్రభుత్వ ప్రాతినిధ్యమే లేదు. కర్ణాటక, తమిళనాడు, కేరళ తదితర రాష్ట్రాల పర్యాటకశాఖల నుంచి ఆయా ప్రభుత్వాల ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు హాజరైనా ఏపీ నుంచి ఎవరూ పాల్గొనలేదు.
అరకులో పర్యాటక శాఖ సిబ్బంది నిరసన - నిరాశతో వెనుదిరిగిన టూరిస్టులు
పెట్టుబడుదారులకు ప్రోత్సాహకాలిచ్చి రాష్ట్రాన్ని ప్రముఖ పర్యాటక కేంద్రంగా మార్చుతామని ఫోజులు కొట్టే జగన్ సుదూరాల నుంచి విశాఖ నగర సందర్శనకు వచ్చే పర్యాటకులకు సౌకర్యంగా ఉండే రుషికొండపై రిసార్టు కూల్చేశారు. 450 కోట్ల రూపాయలతో రాజభవనం నిర్మించుకున్నారు. పాడైన రిసార్టులు, హోటళ్ల అధునికీకరణ కోసం ప్రభుత్వం నుంచి రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థకు ఒక్క రూపాయైనా కేటాయించలేదు. బ్యాంకు నుంచి అప్పు తెచ్చుకోవాలని అనుమతులిచ్చి చేతులు దులిపేసుకున్నారు. ఆస్తులు తనఖా పెట్టుకుని అప్పు ఇవ్వాలని పర్యాటకాభివృద్ధి సంస్థ అధికారులు ఏడాదిన్నరగా బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. చాలారోజుల తర్వాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముందుకొచ్చినా రుణ మొత్తం ఇంకా విడుదల చేయలేదు.
జగన్ హయాంలో పర్యాటక రంగం కుదేలు- పెట్టుబడులకు ప్రైవేటు సంస్థల వెనకంజ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థకు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం లేకపోగా ఉన్న ఆస్తుల్ని, పర్యాటకుల కోసం అమలు చేస్తున్న వివిధ ప్యాకేజీలను ప్రైవేటు సంస్థల చేతుల్లో పెట్టేశారు. దాదాపు 15 రిసార్టులను ప్రైవేటు సంస్థలకు అప్పగించేందుకు ఎన్నికల కోడ్ వచ్చే ముందే రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ టెండర్లు పిలిచింది. దీనిపై ఈటీవీ- ఈనాడులో కథనాలు రావడంతో టెండర్ల ప్రక్రియ ఆపేశారు. అయినప్పటికీ నెల్లూరు జిల్లాలోని మైపాడు బీచ్ రిసార్టును ఇటీవలే ఒక ప్రైవేటు సంస్థకు కట్టబెట్టారు. రాష్ట్రేతర పర్యాటకుల కోసం అమలుచేస్తున్న ప్యాకేజీలను సైతం ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టారు. ఇతర రాష్ట్రాల నుంచి తిరుమల వచ్చేవారికి ఏపీటీడీసీ ఆధ్వర్యంలో కొన్నేళ్లుగా ప్రత్యేకంగా బస్సు ప్యాకేజీ అమలు చేస్తున్నారు. బెంగళూరు, చెన్నై తదితర ప్రాంతాల నుంచి పర్యాటకులను బస్సుల్లో తీసుకొచ్చి తిరుమల వెంకన్న దర్శనం చేయించి మళ్లీ అవే బస్సుల్లో వెనక్కి పంపుతారు. వారికి వసతి, భోజన సదుపాయం ఏపీటీడీసీ (APTDC)నే సమకూర్చేది. ఆదాయం సమకూరే ఈ ప్యాకేజీని ఇటీవలే ప్రైవేటు సంస్థకు కట్టబెట్టారు. ఒక్కో టికెట్‌పై ప్రైవేటు సంస్థ ఏపీటీడీసీకి కమీషన్ చెల్లించనుంది. ఏపీటీడీసీ కోసం టీటీడీ రోజూ కేటాయించే దాదాపు 1100 దర్శన టిక్కెట్లను అధికారులు ప్రైవేటు సంస్థల చేతుల్లో పెట్టినట్లయింది. దీనివల్ల టికెట్లు దుర్వినియోగమయ్యే ఆస్కారముంది.
Vijayawada Bhavani Island: నాడు కళకళ.. నేడు వెలవెల..! భవానీ ద్వీపం దుస్థితిపై పర్యాటకుల ఆవేదన