Tomorrow Ramojirao Memorial Service in Vijayawada:రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్ దివంగత రామోజీరావు సంస్మరణ సభను రాష్ట్ర కార్యక్రమంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు ప్రభుత్వం మెమో జారీ చేసింది. గురువారం నిర్వహిస్తున్న సంస్మరణ సభకు సీఎం చంద్రబాబు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరుకానుండటంతో పర్యవేక్షణ కోసం ఐదుగురు మంత్రులతో కమిటీ ఏర్పాటు చేసింది.
రామోజీ గ్రూప్ సంస్థల ఛైర్మన్, పద్మవిభూషణ్ పురస్కార గ్రహీత రామోజీరావు సంస్మరణ సభ నిర్వహణకు సముచిత ఏర్పాట్లు చేయాల్సిందిగా అన్ని ప్రభుత్వ విభాగాల కార్యదర్శులు, విభాగ అధిపతులు ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల కలెక్టర్లకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సమాజానికి, మీడియా, సినీ రంగాలకు చేసిన విశేష సేవలకుగాను ఆయన గౌరవార్థం సంస్మరణ సభను రాష్ట్ర కార్యక్రమంగా నిర్వహిస్తున్నట్టు ఉత్తర్వుల్లో తెలిపింది.
రామోజీరావు సంస్మరణ సభ నిర్వహణపై మంత్రుల కమిటీ సమీక్ష - Ramoji Rao Memorial Program
విజయవాడలోని కానూరులో ఉన్న అనుమోలు గార్డెన్స్‌లో గురువారం సాయంత్రం 4 గంటలకు సంస్మరణ సభ నిర్వహిస్తున్నట్టు తెలిపింది. ఏర్పాట్ల పర్యవేక్షణకు ఐదుగురు మంత్రులతో కమిటీని ఏర్పాటు చేసింది. మంత్రులు పార్థసారథి, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్, కొల్లు రవీంద్ర, నిమ్మల రామానాయుడు కమిటీ సభ్యులు వ్యవహరిస్తారని తెలిపింది. మంత్రుల కమిటీకి సహకరించేందుకు అధికారులతో మరో కమిటీని నియమించింది. ఆ కమిటీకి సీఆర్డీఏ కమిషనర్ కాటమనేని భాస్కర్ కన్వీనర్ వ్యవహరిస్తారు.
కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల కలెక్టర్లు, విజయవాడ పోలీసు కమిషనర్, కృష్ణా జిల్లా ఎస్పీ విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్, ఏపీసీపీడీసీఎల్ సీఎండీతోపాటు మరికొందరు అధికారుల్ని కమిటీలో సభ్యులుగా నియమించింది. సభ నిర్వహణ ఏర్పాట్లపై కమిటీలోని మంత్రులు పార్థసారథి, కొల్లు రవీంద్ర, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్, నిమ్మల రామానాయుడు వెలగపూడి సచివాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఏర్పాట్లను తెలుసుకున్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రధాన వేదిక, దాని ప్రాంగణంలో చేస్తున్న ఏర్పాట్లు, హాజరుకానున్న ప్రముఖులకు వసతి, రవాణా, ఇతర ఏర్పాట్లను అధికారులు వివరించారు.
రామోజీరావు తెలుగు జాతికి బ్రాండ్ అంబాసిడర్. క్రమశిక్షణ, కష్టపడే తత్వానికి నిలువుటద్దం. ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభమైన పత్రికారంగం ద్వారా ప్రజలను చైతన్యపరచడానికి ఎంతో కృషి చేశారు. ప్రసార మాధ్యమంలోనూ అదే తీరు కొనసాగించారు. హాలీవుడ్ స్థాయిని మించి రామోజీ ఫిలింసిటీని నిర్మించారు. సినీరంగ అభివృద్ధికీ కృషి చేశారు. ఏ రంగాన్ని తీసుకున్నా ఆయన విజయాల పరంపరే కనిపిస్తుంది. తెలుగు జాతి స్ఫూర్తి ఆయన. భావితరాలకు ఆదర్శం. అత్యున్నత స్థానంలో ఉన్న ఆయన వ్యక్తిత్వాన్ని గౌరవించేలా సంస్మరణ సభను నిర్వహిస్తున్నాం. - మంత్రి నిమ్మల రామానాయుడు