Chiranjeevi Tribute To Ramoji Rao : ఈనాడు గ్రూప్ ఛైర్మన్ రామోజీ రావు అస్తమించారు. ఆయన మరణవార్త విని సినీలోకం దిగ్భ్రాంతికి గురైంది. ఆయన మతిపట్ల కొందరు తారలు సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తుంటే మరికొందరు హైదరాబాద్ రామోజీ ఫిలింసిటీలో ఉంచిన ఆయన పార్థివదేహానికి నివాళులు అర్పించి అంజలి ఘటిస్తున్నారు.
Chiranjeevi About Ramoji Rao :ఈ క్రమంలో సినీ నటుడు, మెగాస్టార్ చిరంజీవి రామోజీ ఫిలింసిటీకి వచ్చారు. రామోజీ పార్థివదేహానికి ఆయన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయనతో ఉన్న అనుబంధాన్ని చిరంజీవి గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనాడు గ్రూప్ ఛైర్మన్ రామోజీరావు మరణం తీరని లోటు అని సినీ నటుడు, మెగాస్టార్ చిరంజీవి అన్నారు.
తెలుగుజాతి గొప్ప వ్యక్తిని, మహాశక్తిని కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ అనేకసార్లు రామోజీరావు సలహాలు తీసుకున్నానని తెలిపారు. పెన్నులు సేకరించడం రామోజీ హాబీ అని చెప్పారు. రామోజీరావు తన ఆలోచనలను డెయిరీలో రాసుకునేవారన్నారు. సమాజానికి ఏం చేయాలని నిరంతరం తపన పడేవారని చిరంజీవి తెలిపారు. రామోజీరావు వ్యక్తి కాదు శక్తి అని కొనియాడారు. స్వయంకృషితో ఎదిగిన మేరు పర్వతం ఈనాడు నెలకొరిగింది అంటే జీర్ణించుకోలేకపోతున్నానని అన్నారు. సినీ పరిశ్రమ ఒక పెద్దని కోల్పోయిందని బాధపడ్డారు. తెలుగు రాష్ట్రాల ప్రజలు ఒక గొప్ప వ్యక్తిని కోల్పోయిందని ఆవేదన చెందారు.